
అన్ సీజన్‌లోనూ పెరిగిన ధర
ఇటు కొబ్బరి, అటు కురిడీకి మార్కెట్‌లో జోష్
వెయ్యి కాయలు రూ.16 వేలు
ఆశాజనకంగా దిగుబడులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: శ్రీరామ నవమి నుంచి వినాయక చవితి వరకూ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు అన్‌సీజన్. చవితి పండుగకు నెల రోజుల ముందు నుంచి కొనుగోలు సీజన్ మొదలవుతుంది. అటువంటిది అన్ సీజన్‌లో కొబ్బరి ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఒకవైపు పచ్చి కొబ్బరికాయ ధర పెరగగా.. మరోవైపు కురిడీ కొబ్బరి రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ఒక్కసారిగా ధరలు పెరగడంతో మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది.
కొనుగోళ్లు... ఎగుమతులు
గత రెండు మూడు రోజుల్లో కొబ్బరి పచ్చికాయ ధర గణనీయంగా పెరిగింది. వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. రెండు రోజుల కిందట రూ.13,500 నుంచి రూ.14 వేల వరకూ ఉండేది. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు గత మార్చి నెల నుంచి కొబ్బరి బొండాల సేకరణ అధికంగా ఉంది. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల కొబ్బరి అవసరాలను రాష్ట్ర కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల స్థానిక అవసరాల కోసం మన రాష్ట్రం నుంచి కొబ్బరికాయ కొనుగోలు పెరిగింది. ఈ కారణంగా ధర పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
కురిడీ... సంబరపడి
అంబాజీపేట మార్కెట్‌లో కురిడీ కొబ్బరి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వారం రోజుల కిందట కురిడీ కొబ్బరిలో పాతకాయ గండేరా రకం (పెద్దకాయ) ధర వెయ్యికి రూ.20 వేలు మాత్రమే ఉండేది. ఇది రూ.22,500 వరకూ పెరిగింది. అలాగే గటగటా (చిన్నకాయ) వెయ్యికి రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరింది. కొత్త కాయలో గండేరా రూ.21,500, గటగటా రూ.19,500 చొప్పున ధర పలుకుతున్నాయి.
కురిడీకి ధర రావడం వెనుక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేకపోవడం కూడా ఒక కారణం. ఉత్తరాదిలో ఆషాఢ మాసంలో కొబ్బరి వినియోగం అధికంగా ఉంటుంది. ఆ మాసానికి ఇంకా నెల రోజులు ఉండడంతో ధర పెరగడానికి ఇదొక కారణం. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 70 నుంచి 100 లారీల వరకూ కురిడీ కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.
మరింత పెరుగుతుందనే అంచనాతో..
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు నెలల దింపు కాలానికి 1,500 నుంచి 2 వేల వరకూ కాయలు దిగుబడిగా వస్తున్నాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండడం, అందుకు తగినట్టుగా ధరలు పెరగడంతో చాలా రోజుల తరువాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు జోష్ వచ్చింది. ధర మరింత పెరుగుతోందనే అంచనాతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు.