పది పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 15 2026 1:24 AM | Updated on Mar 15 2026 1:24 AM

ముమ్మిడివరం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు అన్నారు. ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని డీఈవో కార్యాలయంలో ఆయన శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి జరిగే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 19,310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి 108 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 108 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లను నియమించామన్నారు. జిల్లాలోని 25 పోలీస్‌ స్టేషన్లలో పరీక్షా పేపర్లు డిపాజిట్‌ చేశామని, పరీక్షకు అర్ధగంట ముందు పరీక్షా కేంద్రాలకు తీసుకు వస్తారన్నారు. 234 మంది దివ్యాంగుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, అసలు రాయడానికి వీలు లేనంటువంటి విద్యార్థులకు సహాయకులుగా కేంద్రానికి ఒక ఐఆర్‌టీని ఏర్పాటు చేేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్‌ అమలు చేస్తోందని, అలాగే విద్యార్థులు సివిల్‌ డ్రెస్‌లో రావాలన్నారు. పరీక్షల విభాగం ఏపీ బి.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు.

కల్యాణ మండపం, అన్నదాన భవనానికి శంకుస్థాపన

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న కల్యాణ మండపం, అన్నదాన భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వాడపల్లిలో ఆర్యవైశ్య ప్రముఖులను కలిసి అభినందించారు. ఆయన తొలుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జగ్గిరెడ్డి వెంట మండల పరిషత్‌ అధ్యక్షురాలు కుండ అన్నపూర్ణ, మార్గాని గంగాధర్‌, జెడ్పీటీసీ సభ్యులు బోనం సాయిబాబు, వాడపల్లి ఉప సర్పంచ్‌ పోచిరాజు బాబూరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు కనుమూరి శ్రీను రాజు, మెర్ల వెంకటేశ్వరరావు, వాసు ఉన్నారు.

గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో

సరికొత్త మోసాలు

అమలాపరం టౌన్‌: గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో తాజాగా జరుగుతున్న సరికొత్త సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా సూచించారు. ఈ మేరకు శనివారం రాత్రి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నకిలీ వైబ్‌ సైట్‌ లింకులు పంపిస్తూ తక్కువ ధరకే సిలిండర్‌ ఇస్తామని సోషల్‌ మీడియాలో ప్రకటనలు చేస్తారన్నారు. గ్యాస్‌ కోసం ముందుగా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుతూ ప్రజల బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తారన్నారు. గ్యాస్‌ బుకింగ్‌ కోసం సంబంధిత గ్యాస్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లను మాత్రమే వినియోగదారులు ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే తక్షణమే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలని, లేదా సైబర్‌ క్రైమ్‌ వెబ్‌ సైట్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి

రూ.75 లక్షల భారీ పరిహారం

గొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement