అత్యాచార నిందితుడిని అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడిని అరెస్ట్‌ చేయాలి

Mar 15 2026 1:24 AM | Updated on Mar 15 2026 1:24 AM

అమలాపురం టౌన్‌: మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి సంఘటనపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ ఆ గ్రామంలో పర్యటించి వాస్తవాలను రాబట్టింది. ఈ ఘటనలో నిందితుడైన ఎడ్ల సూరిబాబును తక్షణమే అరెస్ట్‌ చేయాలని వేదిక డిమాండ్‌ చేసింది. నిందితుడు గతంలో కూడా ఇదే బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారాన్ని సేకరించింది. ఈ విషయాలను ఉమ్మడి జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు మహ్మద్‌ ఇక్బాల్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. బాలిక తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, తనపై కేసు లేకుండా గ్రామ పెద్దల ఒత్తిడితో రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని కమిటీ బృందానికి గ్రామ ప్రజలు చెప్పారని ఇక్బాల్‌ పేర్కొన్నారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని తక్షణమే అరెస్ట్‌ చేసి, బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడు అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి నాటకీయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

కోరింగ అభయారణ్యం

సందర్శన

తాళ్లరేవు: కేరళకు చెందిన వరల్డ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తల బృందం శనివారం కోరింగ అభయారణ్యాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కోరింగ ఫారెస్ట్‌ కాంప్లెక్స్‌లో ఫారెస్ట్‌ రేంజర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఈటీ నిర్వహణ, మడ అడవుల భాగస్వామ్యంతో ఈడీసీల అభివృద్ధి తదితర అంశాలను వివరించారు. శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి డాక్టర్‌ సనల్‌ సి.విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని తమ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు గోపి నాగేంద్ర కుమార్‌, ధనుంజయ సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరంలోని ఏపీ ఫారెస్ట్‌ అకాడమీకి చెందిన 41 మంది ట్రైనీలు అభయారణాన్ని సందర్శించారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కె.మహేష్‌ కోరింగ అభయారణ్యం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్‌ ఏవీ రమణమూర్తి, ఎఫ్‌బీఓ సీహెచ్‌ ధనలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో

1,018 కేసుల పరిష్కారం

అమలాపురం టౌన్‌: స్థానిక కోర్టుల ప్రాంగణంలో శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో రూ.2,69,73,408 విలువైన 1,018 కేసులు పరిష్కారమయ్యాయి. మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్‌ ఆధ్వర్యంలో ఈ నేషనల్‌ లోక్‌ అదాలత్‌ జరిగింది. పరిష్కారమైన వాటిలో 21 సివిల్‌, 935 క్రిమినల్‌, 26 మోటారు ప్రమాదాలు, 12 బీఎస్‌ఎన్‌ఎల్‌, 24 బ్యాంక్‌ కేసులు ఉన్నాయి. అదాలత్‌లో సీనియర్‌ డివిజన్‌ సివిల్‌ జడ్జి పి.రమణారెడ్డి, జూనియన్‌ డివిజన్‌ సివిల్‌ జడ్జి ఎం.రహీంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

క్రీడా స్ఫూర్తితో

ముందుకు సాగాలి

అమలాపురం రూరల్‌: ఆటల్లో గెలుపు, ఓటమి సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని జేసీ నిషాంతి అన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ మాస్టర్స్‌ చాంపియన్‌షిప్‌ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ స్టేడియంలో షటిల్‌ కోర్టుకు ఏసీ సౌకర్యం కల్పిస్తామన్నారు. డీఎస్‌డీవో రుద్ర వైకుంఠరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఇక్కడ నిర్వహించడం వల్ల స్థానిక క్రీడాకారులకు మంచి అనుభవం లభిస్తుందన్నారు, కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడ స్వామి నాయుడు స్టేడియం క్రీడాకారుడు మండెల బాబీ, స్టేడియం కోచ్‌ భీమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement