
నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జల్‌శక్తి మంత్రి సమావేశం
ఎజెండాలో బనకచర్లను చేర్చడంపై తెలంగాణ అభ్యంతరం
ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదన
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు (పీబీఎల్‌పీ) అనుమతిచ్చే అంశాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నిర్వహించే సమావేశం ఎజెండాగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతుల్లేని.. గోదావరి ట్రిబ్యునల్, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తలపెట్టిన పీబీఎల్‌పీపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టును తప్పించాలని కోరింది.
పీబీఎల్‌పీపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎఫ్‌ఆర్ (ప్రాథమిక నివేదిక)ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించాలని డిమాండ్ చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది.
⇒ పోలవరం కుడి కాలువ నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా పీబీఎల్‌పీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగు నీటితో పాటు 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ.. 80 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీలు అందిస్తామని చెబుతోంది. పీబీఎల్‌పీ డీపీఆర్ రూపకల్పనకు అనుమతి కోసం.. పీఎఫ్‌ఆర్‌ను మే 22న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అయితే, సీడబ్ల్యూసీ దీనిపై గోదావరి బేసిన్‌లోని రాష్ట్రాలు, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ల అభిప్రాయాన్ని కోరింది. గోదావరిలో వరద జలాలు లేవని, పీబీఎల్‌పీతో తమ ప్రాజెక్టుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది.
⇒ ఇక పీబీఎల్‌పీకి పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారీ కోసం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ (ఈఏసీ)కి జూన్ 5న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. గోదావరిలో వరద జలాలు లేవని.. నీటి కేటాయింపులు లేని ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దంటూ ఈఏసీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో పీబీఎల్‌పీతో పాటు కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలపై చర్చించేందుకు బుధవారం రెండు రాష్ట్రాల సీఎంలను కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఢిల్లీకి ఆహ్వానించారు.
ఎవరి వాదన వారిదే...
గోదావరి నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని.. అందులో 200 టీఎంసీలు పీబీఎల్‌పీ ద్వారా మళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నికర జలాలు కాకుండా వరద జలాలు మళ్లిస్తున్నందున ఏ రాష్ట్రానికి, ఏ ప్రాజెక్టు హక్కులకూ విఘాతం కలగదని అంటోంది. కానీ, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను పూర్తిగా వాడుకోవడం లేదని.. ఆ జలాలే సముద్రంలో కలుస్తున్నాయని.. వరద జలాలు కాదని చెబుతోంది. వాటి ఆధారంగా పీబీఎల్‌పీ చేపడితే తమ రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఏపీ సింగిల్ పాయింట్... బహుళ అంశాలతో తెలంగాణ
కేంద్ర మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై రెండు రాష్ట్రాలు ఎజెండాలు పంపాయి. పీబీఎల్‌పీకి అనుమతి ఒక్కదానినే ఏపీ పేర్కొనగా.. దీనిపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని ఎజెండా నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పాలమూరు, డిండిలకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు, తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్లకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం (ఏబీఐపీ) కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాల వినియోగం కోసం కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపును తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది.