CM YS Jagan YSR District Tour: AP: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు

CM YS Jagan YSR District Tour Updates - Sakshi

వైఎస్సార్‌ జిల్లా వేల్పులలో ఆధునిక వసతులతో ఒకేచోట అన్ని భవనాలు

సచివాలయం, ఆర్బీకే, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం,

డిజిటల్‌ లైబ్రరీ, తపాలాశాఖ కార్యాలయం, శుద్ధినీటి కేంద్రం, బస్సు షెల్టర్‌ నిర్మాణం

సాక్షి ప్రతినిధి, కడప: అధునాతన హంగులతో వైఎస్సార్‌ జిల్లా వేల్పుల గ్రామంలో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ భవన సముదాయం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్‌ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సాయంత్రం సందర్శించి ప్రారంభించారు. రూ.3.22 కోట్లతో అత్యాధునిక వసతులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు.

సచివాలయ భవనంతో పాటు ఆర్బీకే, వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం, డిజిటల్‌ లైబ్రరీ, తపాలాశాఖ కార్యాలయం, శుద్ధి నీటి కేంద్రం, ఓవర్‌ హెడ్‌ ట్యాంక్, బస్సు షెల్టర్‌ తదితరాలతో రాష్ట్రంలో మోడల్‌ ప్రాంగణంగా నిర్మాణం చేపట్టారు. కడప–పులివెందుల ప్రధాన మార్గం పక్కనే ఎకరం స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ భవన సముదాయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దడం అభినందనీయమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. స్థానిక నాయకులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ భవనాల నిర్మాణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు.

వలంటీర్లను పలుకరిస్తూ.. కలియదిరుగుతూ.. 
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి కడప చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పలువురు ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. వర్షం పడుతుండటంతో 3.25 గంటలకు కడప నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. 4.40 గంటలకు వేల్పుల చేరుకుని సచివాలయ సముదాయాన్ని ప్రారంభించి అన్ని భవనాలను  క్షుణ్నంగా పరిశీలించారు. సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాలలో కలియదిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్‌ అరగంటకు పైగా గడిపారు.

వలంటీర్లు, సిబ్బందితో మాట్లాడారు. విధులపై ఆరా తీశారు. వైఎస్సార్‌ చేయూత ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ–క్రాప్‌ ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. ఆర్బీకేలో 20 నిమిషాలకు పైగా గడిపి అందరినీ పేరుపేరునా పలుకరించారు. 2021–22కి సంబంధించి 650 మందికి ఇన్సూరెన్స్‌ అందలేదని స్థానిక నేతలు వినతిపత్రం అందచేయడంతో తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లో డాక్టర్, సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో సిబ్బందిని పేరుపేరునా పలుకరించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వసతులపై ఆరా తీశారు. సక్రమంగా సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజుకు పలు సూచనలు చేశారు. దాదాపు 2.20 గంటల పాటు ముఖ్యమంత్రి అక్కడే గడిపారు. సచివాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

గాంధీ, వైఎస్సార్‌ విగ్రహాల ఆవిష్కరణ
సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి  7.00 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి 7.35 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడ సీఎంకు స్వాగతం పలికారు. 

వేల్పులలో సీఎం జగన్‌ ప్రారంభించిన వివిధ భవనాలు ఇవీ
గ్రామీణ ఉపాధి హామీ నిధులతో..
♦ రూ.40 లక్షలతో గ్రామ సచివాలయం
♦ రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం
♦ రూ.16 లక్షలతో వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీ
పాడా నిధులతో....
♦ రూ. 40 లక్షలతో వ్యవసాయ సహకార పరపతి సంఘం
♦ రూ. 19.50 లక్షలతో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌
♦ రూ. 17 లక్షలతో పోస్టాఫీసు బిల్డింగ్‌
♦ రూ. 13 లక్షలతో వేదిక, విశ్రాంతి గది
♦ రూ. 8 లక్షలతో బస్సు షెల్టర్‌
♦ రూ. 13 లక్షలతో వెయిటింగ్‌హాలు
♦ రూ. 16 లక్షలతో సీసీ రోడ్డు, పార్కింగ్‌టైల్స్‌
♦ రూ. 32 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం
♦ రూ. 3.10 లక్షలతో బోర్‌వెల్, పైపులైన్‌ పనులు
♦ రూ. 16.50 లక్షలతో ఓవర్‌హెడ్‌ ట్యాంకు
♦ రూ. 3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌
♦ రూ. 29 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ పైపులైన్‌
♦ రూ. 35 లక్షలతో ఫర్నిచర్‌  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top