CM YS Jagan Spandana Video Conference On Corona Third Wave - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఉధృతి తగ్గినా.. జాగ్రత్త

Aug 26 2021 3:24 AM | Updated on Aug 26 2021 1:41 PM

CM YS Jagan Spandana Video Conference On Corona Third Wave - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ప్రభావం ప్రస్తుతం తగ్గినప్పటికీ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ మార్గదర్శకాలను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా ఉధృతి తగ్గింది కాబట్టి నిర్లక్ష్యం వహించే పరిస్థితి తలెత్తకూడదని స్పష్టం చేశారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందో లేదో తెలియదు కానీ సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని జాగ్రత్తలు సూచించారు. కరోనాతో సహజీవనం చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నందున నిరంతరం అప్రమత్తత, సమీక్ష అవసరమన్నారు. ఇంటింటి సర్వేలు కొనసాగాలని, ఎవరికి లక్షణాలున్నా పరీక్షలు చేయాలన్నారు. చదవండి: మిగిలిపోయిన అర్హులకు గడువులోగా ఇవ్వాలి: సీఎం జగన్‌


ఇదే సమయంలో సీజనల్‌ వ్యాధులపై కూడా అప్రమత్తంగా ఉంటూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని, తాగునీటి నాణ్యతపై శ్రద్ధ తీసుకుని 15 రోజులకొకసారి సమీక్షించాలని నిర్దేశించారు. కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు..ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

రికవరీ రేటు ఎలా ఉన్నప్పటికీ..
కలెక్టర్లతో ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినా కోవిడ్‌పై చర్చ జరగని రోజు లేదు. పూర్తి స్ధాయిలో వ్యాక్సినేషన్‌ జరిగే వరకు వరకు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. పాజిటివిటీ రేటు, రికవరీ రేటు ఎలా ఉన్నా కోవిడ్‌పై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. రాష్ట్రంలో సగటున 1,300 కేసులకు పడిపోయినప్పటికీ మనం జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. రివకరీ రేటు 98.63 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నప్పటికీ అప్రమత్తంగానే ఉండాలి. కోవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. మాస్కులు ధరించడం తప్పనిసరి. నిబంధనలు అతిక్రమించే దుకాణాలు, ఇతర సముదాయాలకు జరిమానాలు విధించాలి. పెళ్లి వేడుకల్లో 150 మందికి మించి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చదవండి:AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు

సమర్థంగా 104 నిర్వహణ
అన్ని సమస్యలను పరిష్కరించేలా 104 కాల్‌సెంటర్‌ నంబర్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కావాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేయాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు నిర్దేశించిన ప్రోటోకాల్స్‌ పాటించాలి. కోవిడ్‌ తగ్గింది కాబట్టి పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు.

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత
థర్డ్‌ వేవ్‌ వస్తుందో లేదో తెలియదు కానీ మనం సన్నద్ధంగా ఉండాలి. కార్యాచరణ ప్రకారం ముందుకు సాగాలి. ఆస్పత్రులను, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. నర్సులకు శిక్షణ ఇవ్వాలి. అందుబాటులో వైద్యులు, తగినన్ని బెడ్లను, ఆస్పత్రులను ఉంచుకోవాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలెండర్లు, కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. 100 బెడ్లు దాటిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై పర్యవేక్షణ చేయాలి.

విద్యా సంస్థలు ఎస్‌వోపీలను పాటించాలి
రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభమైనందున విద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్‌వోపీలను విడుదల చేశాం. వాటిని తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాఠశాలలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని టీచర్లు సమాచారం ఇస్తే మార్గదర్శకాల ప్రకారం అక్కడ ఫోకస్డ్‌గా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా వెంటనే కోవిడ్‌ టెస్టులు చేయాలి.

సచివాలయం యూనిట్‌గా..
రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,90,93,476 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. 72,18,532 మందికి డబుల్‌ డోస్, 1,18,74,944 మందికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్లు ఇచ్చాం. 80 శాతం మంది ప్రజలకు డబుల్‌ డోస్‌ ఇచ్చేంతవరకూ అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. 45 సంవత్సరాలు దాటిన కేటగిరీలో 90 శాతానికిపైగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాలి. సచివాలయాన్ని యూనిట్‌గా పెట్టుకుని ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. దీనివల్ల అందరికీ టీకాలతోపాటు వృథాను అరికట్టగలుగుతాం.

ఏజన్సీల్లో ఇన్సెంటివ్‌లు.. డిప్యుటేషన్లు వద్దు 
వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంత మంది ఉండాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దీనిపై 90 రోజుల్లోగా వివరాలు ఖరారు చేయాలి. ఎంతమంది సిబ్బంది అవసరమో నిర్ధారించాలి. ఈ మేరకు గడువులోగా నియామకాలు పూర్తి కావాలి. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి.

డిప్యుటేషన్లు వద్దు. డాక్టర్లు, సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని చికిత్స అందించే స్థాయికి ప్రభుత్వ ఆస్పత్రులను తీసుకెళ్లాలి. నాడు – నేడు ద్వారా టీచింగ్‌ ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్ధాయిలో నిర్మిస్తున్నాం. దీనికి అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలి. కలెక్టర్లు ఈ టాస్క్‌ పూర్తి చేయాలి. మొత్తం 125 మున్సిపాల్టీలలో 528 అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై మరింత దృష్టి సారించాలి.  

Advertisement
 
Advertisement
Advertisement