ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం

Cm ys Jagan says hes unlike Naidu who can shift to another state - Sakshi

వైఎస్సార్‌ జిల్లా కమలాపురం సభలో సీఎం వైఎస్‌ జగన్‌

రూ.905 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు..

చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలు రూ.13.60 కోట్లు విడుదల

జనవరి ఆఖరులో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శ్రీకారం

రూ.8,800 కోట్లతో ఫేజ్‌–1, ఫేజ్‌–2లుగా పనులు

గత ప్రభుత్వం హయాంలో దోచుకో, పంచుకో, తినుకో..

ఈ రోజు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ

మనం 98% హామీలను నెరవేర్చాం

తేడా మీరే గమనించండి.. దేవుడిని, మిమ్మల్నే నమ్ముకున్నా

సాక్షి ప్రతినిధి, కడప: ‘ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా మమకారం.. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం.. ప్రజల సంక్షేమమే నా విధానం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని, చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లో మీడియాను నమ్ముకోలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలేనని, మనందరి ప్రభుత్వంలో లంచాల్లేవు.. వివక్ష లేదని స్పష్టం చేశారు.

బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. గతంలో అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌ అని, గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని కోరారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో రూ.905 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘ఆరోజు మీరు.. నాన్న చనిపోలేదు.. మా గుండెల్లోనే ఉన్నాడు.. నువ్వు మా బిడ్డ.. నువ్వు రాష్ట్రం వైపు చూడు.. మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం’ అని మీరు దీవించి పంపారని, ఈ రోజు మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని చెప్పారు.

ఈ ప్రాంతంలో వెనుకబాటును జయించడం కోసం గాలేరు నగరి సుజల స్రవంతి తీసుకు రావడం కోసం అప్పట్లో దివంగత సీఎం.. నాన్న గారు చేసిన పనుల గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ఎక్కడ కృష్ణా నది? ఎక్కడ కడప జిల్లా? అటువంటి కృష్ణా నది కడప జిల్లాకు వచ్చిందంటే ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి కృషి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

కమలాపురంలో అభివృద్ధి పరుగులు 
కమలాపురంలో ఈ రోజు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు రూ.905 కోట్ల విలువైనవి. 6,914 ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన మన పిల్లలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్న తపన, తాపత్రయంతో కొప్పర్తిలో ఇండస్ట్రియల్‌ పార్కు అభివృద్ధి చేస్తున్నాం.
 ఇందులో 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ మాన్యు­ఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ పెడుతున్నాం. జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కింద మరో 3,155 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నాం. ఈ పార్కులో ప్రతి పరిశ్రమ పూర్తయితే... కేవలం కొప్పర్తిలోనే ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో మాత్రమే లక్ష ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రియల్‌ పార్కు కూడా పూర్తయితే కనీసం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి. పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే డిక్సన్‌ వంటి కంపెనీలకు సంబంధించి కట్టడాలు కూడా మొదలయ్యాయి.
కొప్పర్తి పార్కుకు బ్రహ్మంసాగరం నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించేలా 33.4 కిలోమీటర్ల పైపులైన్‌ ప్రాజెక్టుకు ఈ రోజు రూ.150 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. మరో రూ.38 కోట్లతో ఇక్కడే సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాం.
మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు 
రూ.54 కోట్లతో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది కాక కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ, పోర్టు నుంచి ఇక్కడికి రైల్వే లైను వేయడానికి రూ.68 కోట్లతో కార్గో టెర్మినల్‌ రైల్వే లైన్‌ నిర్మాణం కూడా చేసేందుకు శంకుస్థాపన చేశాం. రాబోయే సంవత్సరాలలో చదువుకున్న మన పిల్లలకు ఇక్కడే మన జిల్లాలోనే ఉద్యోగాలు రావాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. 

► మరో రూ.34.50 కోట్ల వ్యయంతో కొప్పర్తితో ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ నిర్మాణం చేస్తున్నాం. మరో రూ.268 కోట్లకు పైగా ఖర్చయ్యే వివిధ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేశాం. ఈ రోజు రేణిగుంట  రాయలచెరువు, పాత కడప రోడ్డు మీదుగా కమలాపురం, ఓబులంపల్లి, రామన­పల్లికి అనుసంధానం చేస్తూ రూ.25.7 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. కమలాపురంలో రూ.39 కోట్లతో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. కమలాపురానికి మేలు జరిగే ప్రాజెక్టు ఇది.
రూ.88 కోట్లతో బైపాస్‌ రోడ్డు 

కమలాపురం పట్టణాన్ని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేశాం. రూ.88 కోట్లతో బైపాస్‌ రోడ్డు ప్రాజెక్టుకు ఇవాళ శంకుస్థాపన చేశాం. ఇందులో కేవలం భూసేకరణ కోసమే రూ.16 కోట్లు.

ఖాజీపేట, కమలాపురం రోడ్డు నుంచి సంబటూరుకు రూ.3.82 కోట్లతో 4.35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం తలపెట్టాం.  వల్లూరు, ఆదినిమ్మాయపల్లె రోడ్డు, చిన్నమాచుపల్లె, పుష్పగిరి రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పనులను రూ.22 కోట్లతో చేపట్టాం. కోగటం పాయసంపల్లె రోడ్డుకు రూ.8 కోట్లు కేటాయించాం. పాపాఘ్ని నది మీద వంతెన నిర్మాణం మరో ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది రేణిగుంట, కడప, ముద్దనూరు మధ్య కనెక్టివిటీకి కీలకం. రూ.82 కోట్ల వ్యయంతో 1.81 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నాం. 

కమలాపురంలో రూ.93 కోట్లతో సమగ్ర నీటి సరఫరా కోసం 67.66 కిలోమీటర్ల పైపులై¯ŒŒ  నిర్మాణం చేపడుతున్నాం. తద్వారా 5,500 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వనున్నాం.రూ.58 కోట్లతో ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వరద నీరు ప్రవహించేందుకు మరో రూ.8 కోట్లతో డ్రైన్‌ నిర్మాణం చేపడుతున్నాం. రూ.5.70 కోట్లతో జంక్షన్ల నిర్మాణ పనులు చేపడుతున్నాం.

రోజుకు 5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో పనిచేసే మురుగునీటి పారిశుద్ధ్య ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ను రూ.18.60 కోట్లతో చేపట్టనున్నాం. రూ.3 కోట్లతో అన్ని వసతులతో మున్సిపల్‌ భవనం నిర్మిస్తున్నాం. కమలాపురంలో పేరున్న దర్గా ఇ గప్ఫారియాకు రూ.2.50 కోట్లతో ప్రహరీ, ఫంక్ష¯ŒŒ  హాల్, గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రారంభోత్సవం చేశాం. రూ.36 కోట్లతో బీసీలకు మంచి చేసేందుకు బీసీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణం చేపడుతున్నాం.

రూ.15 కోట్లతో 2.18 ఎకరాల్లో రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్‌కు)కు సంబంధించిన ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మిస్తున్నాం. మొత్తంగా ఈ రోజు కమలాపురం నియోజకవర్గం రూపురేఖలు మార్చేలా చేస్తున్న శంకుస్థాపనల విలువ రూ.905 కోట్లు. చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించి దశాబ్ధాలుగా ఉన్న ఉద్యోగుల బకాయిలు రూ.13.60 కోట్లు ఈ రోజు ఇక్కడికి వచ్చే ముందే రిలీజ్‌ చేసి వచ్చాను. 
జనవరిలో కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు 
రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ కడతామని విభజన చట్టంలో రాసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆ ప్రాజెక్టు రావాలన్న తపనతో మనం అడుగులు ముందుకు వేసి, జిందాల్‌ స్టీల్స్‌తో మాట్లాడి.. రూ.8,800 కోట్లతో ఫేజ్‌–1, ఫేజ్‌ –2 కింద కడప స్టీల్‌ ప్లాంట్‌ చేపట్టేందుకు ముందుకు వచ్చేలా చేశాం. అన్ని ఒప్పందాలు పూర్తి చేసుకుని జనవరి చివరిలో పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుడతాం.

ఇది రైతు, పేద, మహిళ పక్షపాత ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా మీ బిడ్డ బటన్‌ నొక్కి ఈ మూడున్నరేళ్ల కాలంలో అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా పంపించిన సొమ్ము (డీబీటీ ద్వారా) రూ.1,79,170 కోట్లు. ఇక ఇళ్లు, ఇళ్ల స్థలాలు, గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి నాన్‌ డీబీటీ పథకాలు కూడా కలుపుకుంటే మరో రూ.1.41 లక్షల కోట్లు ఇచ్చాం. ఇలా  అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, అవ్వాతాతలకు మీ బిడ్డ మేలు చేయగలుగుతున్నాడు.

ఒక్క కమలాపురం నియోజకవర్గంలోనే రూ.1017 కోట్లు ఇచ్చాం.  ఈ నియోజకవర్గంలో 72,357 కుటుంబాలు నివసిస్తుంటే ఇందులో 66,955 కుటుంబాలు అంటే 92.53 శాతం కుటుంబాలకు నేరుగా డబ్బులు జమ చేశాం. 

గత ప్రభుత్వంలో పింఛన్‌ కేవలం రూ.1000. అది కూడా ఏ పార్టీ వారో చూసి.. కొందరికే ఇచ్చేవారు. దానికీ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి.  ఏ పథకం కావాలన్నా, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. 

ఆ రోజుకీ ఈ రోజుకీ తేడా ఒక్కటే. కేవలం ముఖ్యమంత్రి మారడం ఒక్కటే తేడా. ఆ రోజుల్లో ఆ ముఖ్యమంత్రి దోచుకో, పంచుకో, తినుకో. ఆ ముఖ్యమంత్రి.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు చాలనుకుని రాజకీయాలు చేశారు.  ఈ రోజు మీ బిడ్డ డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌)ని నమ్ముతున్నాడు.   ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.  

చంద్రబాబు మాదిరిగా నేను ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనో.. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అనో  అనడం లేదు. చంద్రబాబు పార్టీతో పాటు కలిసి ఉన్న దత్తపుత్రుడు మాది­రిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా నేను అనడం లేదు. ఇదే నా రాష్ట్రం. ఇక్కడే నా నివాసం. ఇక్కడే నా రాజకీయం. 
ప్రజలు ఎక్కడ అడుగుతారోనని 650 పేజీల బుక్‌లెట్‌గా ఉన్న మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితి గతంలో చూశాం. అటువంటి నాయకులకు.. మాట మీద నిలబడే మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతోంది. మరో 16–18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మిమ్మల్నే. 
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కటి మాత్రం నిజం. ప్రతి మనిషికీ మంచి చేస్తే.. ఆ మనిషి గుండెల్లో చనిపోయిన తర్వాత కూడా బతకడం ఒక వరం. దాని­కోసం మాత్రమే మీ బిడ్డ పాకులాడుతాడు.     

నిండు కుండల్లా ప్రాజెక్టులు
నాన్న గారు మనమధ్య నుంచి వెళ్లిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ మనం చూస్తున్నాం. చిత్రావతి డ్యామ్‌ను నాన్నగారి హయాంలో పూర్తిగా నిర్మించారు. 10 టీఎంసీల సామర్థ్యమున్న ఆ ప్రాజెక్టులో గతంలో ఏ రోజూ పూర్తిగా నీళ్లు నింపని పరిస్థితి. మూడు టీఎంసీలు నింపితే గగనం. ఇవాళ మీ బిడ్డ రూ.250 కోట్లతో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చారు కాబట్టే 10 టీఎంసీల నీళ్లు నింపగలిగాం.

గండికోట ప్రాజెక్టు సామర్థ్యం 27 టీఎంసీలు. నాన్న గారి హయాంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులో ఏ రోజు కూడా కనీసం 10–13 టీఎంసీల నీళ్లు నింపలేని పరిస్థితి. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక అదే గండికోటకు మరో రూ.550 కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చారు. దాంతో ఈ రోజు 27 టీఎంసీల నీళ్లు కనిపిస్తున్నాయి. 

బ్రహ్మంసాగర్‌ 17 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టు. గత ప్రభుత్వ హయాంలో కనీసం 5–6 టీఎంసీల నీళ్లు కూడా నింపని పరిస్థితి. మన ప్రభుత్వంలో తెలుగుగంగ కెనాల్‌ మోడరనైజేషన్‌ కింద రూ.500 కోట్లు ఖర్చు చేసి, జీరో టూ 42 కిలోమీటర్ల వరకు లైనింగ్‌ పనులు పూర్తి చేస్తే, ఈ రోజు పూర్తి స్థాయిలో నీళ్లు నిలబడ్డాయని, అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నాయని సగర్వంగా చెబుతున్నా. 

గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి జీఎ¯Œ ఎస్‌ఎస్‌ ఫేజ్‌–1 ప్యాకేజీ –2లో మిగిలిన పనులన్నీ పూర్తి చేయడానికి నడుం బిగించాం. సర్వారాయసాగర్‌ రిజర్వాయర్, వామికొండ రిజర్వాయర్‌కు సంబంధించి డ్రైన్స్‌ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ మీద దృష్టి పెట్టాం. దాదాపు రూ.213 కోట్లతో చేపట్టే పనుల ద్వారా 35 వేల ఎకరాలకు నీరందుతుంది. ఈ పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top