కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దు

CM YS Jagan says that do not compromise on the minimum support price for farmers - Sakshi

ఏ ఒక్క రైతూ నష్టపోకుండా పంటల కొనుగోలు

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై సమీక్షలో సీఎం జగన్‌ 

రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడి మెరుగైన ధర రావాలి 

కనీస ధర లేక రైతులు నష్టపోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం

గిట్టుబాటు ధర రాదన్న బెంగే అక్కర్లేదు

రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌లో పోటీ ఏర్పడాలి. తద్వారా రైతులకు మెరుగైన ధర రావడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్‌లో పోటీ ఏర్పడేలా చేస్తుంది.

ఈ ఏడాది కూడా రూ.3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదని రైతులు బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. పంటలకు ముందుగానే కనీస మద్దతు ధరలు  (ఎంఎస్‌పీ) ప్రకటిస్తామని చెప్పాం. ఆ మేరకు గురువారం (నేడు) ప్రకటించబోతున్నాం.

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతుల పంటలు ఎక్కడా కొనుగోలు జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని, ఈ విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

► రైతులు పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుంది. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని ప్రభుత్వం దాదాపు రూ.3,200 కోట్లు కేటాయించి పలు పంటలు కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసింది.
► ప్రభుత్వం ప్రకటించిన ధరలు రైతులకు దక్కేలా చూస్తాం. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. 

జనతా బజార్లు 
► రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలి. 
► రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్‌ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ యూనీలీవర్‌ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలి. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసేలా ఉండాలి. 
► ఈ సమీక్షలో మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, ఆ శాఖ 
ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top