మాట నిలబెట్టుకున్నాం: సీఎం వైఎస్‌ జగన్‌

CM YS Jagan released Second Phase Compensation to Agrigold Depositors - Sakshi

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసిన మనందరి ప్రభుత్వం

ప్రైవేట్‌ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం న్యాయం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం

అగ్రిగోల్డ్‌ అంశం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి మిగతా బాధితులకు న్యాయం చేస్తాం

ఈ స్కాంకు గత సర్కారులోని పెద్దలే కర్త, కర్మ, క్రియ

ఆస్తులు ఎలా కొట్టేయాలన్న ఆలోచనతోనే గత సర్కారు పెద్దలు పని చేశారు.. ఎన్నికల ముందు జీవో 31 ఇచ్చీ మోసం చేశారు

మనందరి ప్రభుత్వం రాగానే తొలి దశలో రూ.10 వేలలోపు డిపాజిట్‌దారులకు రూ.238.73 కోట్లు ఇచ్చాం

అప్పుడు మిగిలిపోయిన మరో 3.86 లక్షల మందికి ఇవాళ రూ.207.61 కోట్లు ఇస్తున్నాం

రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు 

మొత్తంగా 10.4 లక్షల మంది బాధితులకు రూ.905.57 కోట్లకుపైనే ఇచ్చాం

సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌లో డిపాజిట్‌ చేసి మోసపోయిన లక్షలాది మంది కష్టజీవులను ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం మోసం చేస్తే, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మనందరి ప్రభుత్వం న్యాయం చేసిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ సంస్థలో డిపాజిట్‌ చేసిన వారందరూ కష్టజీవులని, వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అండగా నిలిచామని చెప్పారు. అగ్రి గోల్డ్‌ వ్యవహారం కోర్టుల్లో కొలిక్కి రాగానే ఆస్తులు అమ్మి, మిగతా బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ కంపెనీ మోసం చేస్తే ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని కష్టజీవులకు న్యాయం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో మాటిచ్చానని, అదే విషయాన్ని మేనిఫేస్టోలో కూడా పెట్టామని.. ఆ మేరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డిపాజిట్‌ దారులకు న్యాయం చేశామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి బాధితుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. గతంలో మిగిలిపోయిన రూ.10 వేల లోపు డిపాజిట్‌ దారులు మరో 3.86 లక్షల మందికి రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లను చెల్లించారు. హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్‌ బాధితులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి.. రూ.666.84 కోట్లను వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అగ్రిగోల్డ్‌ బాధితులనుద్దేశించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
వీడియో కాన్ఫరెన్స్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు
► ఈరోజు దేవుడి దయతో దాదాపు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు రూ.666.84 కోట్లు నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం. మొత్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు మొదటి విడత, ఇవాళ ఇస్తున్న రెండో విడత అన్నీ కలుపుకుంటే 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే మన ప్రభుత్వం ఇచ్చింది.
► గత ప్రభుత్వం 2015లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసింది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అడుగులు ముందుకు వేసి బాధితులకు న్యాయం చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన కుటుంబాలు అన్నింటికీ ఆ మొత్తం తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఈరోజుతో పూర్తి చేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా జరగలేదు.

గత ప్రభుత్వ మనుషుల కోసం జరిగిన స్కాం
► అగ్రిగోల్డ్‌ స్కాం అన్నది గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాం అని తేలింది. గత ప్రభుత్వంలో ఉన్న వారే అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏవిధంగా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలు చూపిస్తూ గతంలో అసెంబ్లీలో చెప్పాం.
► అగ్రి గోల్డ్‌ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వంలోని పెద్దలే. ఆ పెద్దలు ఎంత సేపూ అగ్రి గోల్డ్‌ ఆస్తులను ఎలా కొట్టేయాలనే ఆలోచించారు. ఈ మల్టీ స్టేట్‌ స్కాం అనేక రాష్ట్రాల్లో కోర్టుల పరిధిలో విచారణలో ఉంది. కాబట్టి, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవరు.. ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాస పెట్టాం.

రూపాయి కూడా చెల్లించని గత ప్రభుత్వం
► గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా తేల్చింది. వీరికి రూ.785 కోట్లుగా చెల్లించాలని చెప్పింది. ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలకు 2 నెలల ముందు.. 2019 ఫిబ్రవరి 7న జీవో నంబరు 31 జారీ చేసింది. కానీ రూపాయి కూడా చెల్లించలేదు.
► రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూముల్ని, ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా వేగంగా అడుగులు వేస్తాం.
► మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు. మీ ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. 
► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి మంత్రి ఎం శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ అడిషనల్‌ డీజీపీ పీ వీ సునీల్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
విశాఖ వన్‌టౌన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు 

అది శ్రమ జీవుల కష్టార్జితం
► రూపాయి.. రూపాయి దాచుకుని, కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్‌ చేసిన కష్టజీవుల సొమ్మే అగ్రిగోల్డ్‌ డబ్బు. ఇక్కడ డిపాజిట్‌ చేసింది లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, చిన్న చిన్న వృత్తుల వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసి, గాలికి వదిలేసింది. 
► అలాంటి వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ అధికారంలోకి రాగానే 2019 నవంబర్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించాం.
► ఆ సమయంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) జాబితాలో మిగిలిపోయిన మరో 3,86,275 మంది రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు ఇవాళ రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నాం. దీంతో పాటు రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులు దాదాపు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు ఇస్తున్నాం. మొత్తంగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చాం.

రాఖీ పండగ బహుమానం 
అన్నా.. నేను అగ్రి గోల్డ్‌లో నెలకు రూ.500 చొప్పున రూ.11,500 జమ చేశాను. కంపెనీ మూత పడటంతో చాలా బాధపడ్డాను. చంద్రబాబుకు చాలాసార్లు ఫిర్యాదు చేశాం. రోడ్లెక్కి ధర్నాలు చేశాం. కానీ సాయం చేయలేదు. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మా సమస్య చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్‌ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో విడతలో మా డబ్బు మాకు అందింది. ఈ రాఖీ పండగకు మీరు మాకు ఇచ్చిన కానుకిది.    
–విశాలాక్షి, కర్నూలు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top