ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి | CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య

Jun 14 2021 6:29 PM | Updated on Jun 15 2021 12:44 AM

CM YS Jagan Mohan Reddy Review Meeting On Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు,  జిల్లాకేంద్రాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమాల్ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, 104 కాల్‌ సెంటర్ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో  కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జూన్‌ 6 నుంచి 12 వరకు.. వారంరోజుల డేటాను సీఎంకు వివరించారు. అన్నిజిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5శాతం లోపేనని.. 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0–9శాతం లోపల ఉందని.. చిత్తూరు,  అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో 10–19 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 85,637కు తగ్గిందని, రికవరీ రేటు 94.61శాతానికి చేరిందన్నారు. జూన్‌ 12 వరకూ 2303 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని, ఇందులో 157 మంది మృతి చెందారని వెల్లడించారు. కోవిడ్ ‌కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదుకోవడంపై సీఎం ఆదేశాల ప్రకారం జీఓ జారీచేశామని చెప్పారు. వారికి త్వరగా ఆర్థిక సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. 

చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యంపై సీఎం సమీక్ష :
థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువులకు వైద్యచికిత్స సదుపాయాలను.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్నారు. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక వేశామన్నారు. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఊపిరిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలి. పీడియాట్రిక్‌ అంశాలల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలి. కోవిడ్‌ తగ్గిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తున్న పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలి. ఆరోగ్య శ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్దారిస్తున్న రేట్లు వారిని ఇబ్బందులకు గురిచేసే రేట్లు కాకుండా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించి రేట్లు ఫిక్స్‌ చేయాలి. దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలవాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు మూడు వారాలలోపే బిల్లులు చెల్లిస్తున్నాము. ఆరోగ్య శ్రీ కింద ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో కొత్త ఒరవడికి నాంది పలికాయి. బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం అమల్లో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లులు చెల్లింపు అనేది ఆరోగ్యశ్రీ పథకం విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతిరోజూ ఆరోగ్య శ్రీ పథకంపై దృష్టిపెట్టాలి. అప్పుడే పేదవాడి మొహంలో చిరునవ్వు చూడగలుగుతాం’’ అని పేర్కొన్నారు.

అనంతరం హెల్త్‌ హబ్స్‌పై మాట్లాడుతూ.. ‘‘ హెల్త్‌ హబ్స్‌ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాలి. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే హెల్త్‌ హబ్స్‌ వెనుక ప్రధాన ఉద్దేశం. ఉత్తమ వైద్యసేవల విషయంలో ఒక జిల్లాలో పరిస్థితి మెరుగుపడడానికి సంబంధిత హెల్త్‌హబ్‌కింద ఈ ఆస్పత్రులు తీసుకురావాలి. వైద్యసేవలను అందించే విషయంలో జిల్లాలు ఈ హెల్త్‌ హబ్‌లద్వారా స్వయం సమృద్ధి సాధించాలి. సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలి. 2 వారాల్లోగా హెల్త్‌ హబ్‌పై విధివిధానాలు ఖరారు కావాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి కూడా ఆర్ధిక సహాయంపై పరిశీలన చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement