ఏపీ: నేడు రైతు భరోసా రెండోవిడత సాయం

CM YS Jagan To Launch Second Term Raithu Barosa - Sakshi

50,47,383 మంది రైతులకు.. రూ.1,114.87 కోట్ల సాయం

రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఖరీఫ్‌లో 49,45,470 కుటుంబాలకు అందజేత

వాస్తవ సాగుదార్లందరికీ సాయం అందాలన్నదే సర్కారు లక్ష్యం

దీంతో రబీ సీజన్‌లో లక్ష మందికి పైగా పెరిగిన లబ్ధిదారులు

సాక్షి, అమరావతి: రైతు ఆనందమే రాష్ట్ర సంతోషంగా భావించే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో విడత వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ను అందించేందుకు సిద్ధమైంది. కరోనా మహమ్మారి చుట్టుముట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రైతు భరోసాను అందించే ఏర్పాటు చేసింది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేయనున్నారు.

రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) రైతులకూ రైతు భరోసా అందుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్‌ 15న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది. 

ఈసారి 50,47,383 మందికి భరోసా..
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్‌ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top