AP CM YS Jagan Inaugurates Integrated Agriculture Lab At Rayadurgam - Sakshi
Sakshi News home page

మనది రైతుపక్షపాత ప్రభుత్వం: సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Jul 8 2021 1:58 PM

CM YS Jagan Inaugurates Integrated Agriculture Lab In Rayadurgam  - Sakshi

సాక్షి, అనంతపురం: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది అని సీఎం జగన్‌ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్‌ తెలిపారు. 

రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు
పెట్టుబడిసాయం కింద రైతన్నలకు ఏటా రూ.13,500 ఇస్తున్నామని, రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, ప్రతి పంటకు ఈ-క్రాపింగ్‌ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్‌బీకేల్లో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. 

పంట నష్టపోతే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అందజేస్తున్నాం
పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆర్‌బీకేలో అమ్ముకోవచ్చని, రైతులకు అడుగడుగునా ఆర్‌బీకేలు అండగా ఉంటాయని సీఎం జగన్‌ తెలిపారు. పంట నష్టపోతే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కూడా అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ సీజన్‌లోని ఇన్‌పుట్‌ సబ్సిడీని ఆ సీజన్‌లోనే ఇస్తున్నామని, ఆర్‌బీకేల ద్వారా తక్కువ అద్దెకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.

కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అని, ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిగాయని సీఎం జగన్‌ గుర్తుచేశారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవన్నారు. 

దీనికంటే ముందు రాయదుర్గం మార్కెట్‌ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  అంతకుముందు ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం  మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌.. కాసేపు రైతులతో ముచ్చటించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement