AP CM YS Jagan Interaction With Polavaram Flooded Area People, Details Inside - Sakshi
Sakshi News home page

CM YS Jagan: పరిహారం అందించాకే..

Jul 28 2022 3:09 AM | Updated on Jul 28 2022 3:47 PM

CM YS Jagan Comments with Polavaram Flooded Area People - Sakshi

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరులో వరద బాధితులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

45.72 కాంటూర్‌ ప్రాంతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేయాలంటే రూ.వెయ్యి కోట్లో.. రెండు వేల కోట్లో అయితే మనమే ఇచ్చి ముందుకు అడుగులు వేసి ఉండేవాళ్లం. ఏకంగా ఇంకా రూ.20 వేల కోట్లు కావాలి. ఇంత డబ్బు ఇవ్వడం అనేది రాష్ట్ర స్థాయిలో కాని పని. కేంద్రంపై ఆధారపడాల్సిందే. ఇందుకోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఇప్పటికే మనం రూ.2,900 కోట్లు ఇచ్చాం. అవి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. కలిసినప్పుడల్లా అడుగుతున్నాం. లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నాం. ఇకపై మరింత గట్టిగా ప్రయత్నిస్తాం.  ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారాన్ని ఎంత వరకు ఇస్తారో, ఆ స్థాయి వరకే డ్యామ్‌లో నీళ్లు నింపుతాం. అంతకన్నా ఎక్కువ నింపే పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నా.
- సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, ఏలూరు/విశాఖపట్నం: పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్‌ 45.72లో ఉన్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ (రీహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌మెంట్‌) ప్యాకేజ్‌ నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. దాదాపు రూ.23 వేల కోట్లు రావాలని, అందుకోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో మనం ఖర్చు చేసిన నిధుల రీయింబర్స్‌మెంట్‌ కోసం పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

గోదావరి వరదల్లో ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని కుయిగూరు, చట్టి గ్రామాల్లో, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట, తిరుమలాపురంలోని ముంపు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపడానికి డ్యాం భద్రతకు ఇబ్బంది అని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్లూసీ) వారు ఒప్పుకోరన్నారు. ‘మొదట ఒక స్టేజీ వరకు.. ఆ తర్వాత మరికొంత.. మొత్తం మూడేళ్ల సమయానికి పూర్తిగా నింపుతాం.

డ్యాం పూర్తిగా నింపే నాటికి ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా మంచి చేస్తాం. ఆలోపుగా కేంద్రం డబ్బులు ఇచ్చేట్టుగా చేస్తాం. నిధులు ఇవ్వకపోతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపం. మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్మాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగనివ్వను’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంత మహిళలతో సీఎం జగన్‌ 

ఆర్‌ అండ్‌ ఆర్‌కు రూ.20 వేల కోట్లు అవసరం 
► నిర్వాసితులవుతున్న వారందరికీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయి వరకు నింపాలంటే కేవలం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకే దాదాపు మరో రూ.20 వేల కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ సెప్టెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయి వరకు నిర్వాసితులు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా అందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తాం.
► ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యమైనా కూడా చేస్తాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. కానీ ఇక్కడ రివర్స్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా కేంద్రం మనకు డబ్బు ఇస్తే.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ డబ్బును మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.2,900 కోట్లు ఖర్చు చేసింది. 
► ఆ డబ్బును కేంద్రం నుంచి ఇప్పించుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. స్వయంగా నేను ఈ అంశంపై ప్రధాన మంత్రిని పలుమార్లు కలిశాను. కేంద్ర జల వనరుల శాఖ, ఆర్థిక మంత్రులను రాష్ట్ర మంత్రులు పలు దఫాలు కలిసి విజ్ఞాపనలు చేశారు. ప్రతి నెలా వారికి వినతులు ఇస్తూనే ఉన్నారు. ఆశించినంత రీతిలో వారి నుంచి కదలిక రావడం లేదు.
► కేంద్రంలో ఆ కదలిక వచ్చేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సిన ఆ రూ.2,900 కోట్లు ఆలస్యం అయినా, ఇంకేమైనా జరిగినా సరే.. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల స్థాయి వరకు సంబంధించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్‌లోపు పూర్తి చేస్తాం. 
అల్లూరి జిల్లాలో వరద సహాయక చర్యలను సీఎంకు వివరిస్తున్న అధికారులు 

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం 
► పోలవరం నిర్వాసితులకు సంబంధించి గతంలో నేను ఒక హామీ ఇచ్చాను. నాన్నగారి హయాంలో రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఇచ్చారు. వారికి మరో రూ.3.50 లక్షలు ఇచ్చి మొత్తంగా రూ.5 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాను. 
► గతంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ.6.5 లక్షలు ఇచ్చిన వారికి అదనంగా మరో రూ.3.5 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు ఇస్తాం. అవి కూడా ఇచ్చిన తర్వాతే షిఫ్టు చేస్తాం. ఇప్పటికే జీవో కూడా జారీ చేశాం. మీకందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే వేగంగా పూర్తి చేస్తుంది. ఇలాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను. అల్లూరి జిల్లాలోని ఈ నాలుగు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్‌ అడిగారు. దానికి కూడా ఆమోదం తెలుపుతున్నాను. 
► పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ 45.72 మీటర్లకు చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే ప్రకటించింది. ఇలా ప్రకటించిన తర్వాత వాళ్లు ఆపగలిగింది ఏమీ ఉండదు. ఇవాళ కాకపోయినా రేపైనా కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చేది ఈరోజే ఇచ్చేస్తే.. ప్రజలు సంతోషంగా ఉంటారన్న విషయాన్ని వారికి అర్థం అయ్యేలా చెప్తాం.
► ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆలస్యం చేసేకొద్దీ కేంద్ర ప్రభుత్వానికే నష్టం అన్న విషయాన్ని వారికి తెలియజేస్తాం. ఆలస్యం అయితే ఆర్‌అండ్‌ఆర్‌ కింద చెల్లించే మొత్తం పెరుగుతూ పోతుంది. 2013 చట్టం ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం జారీ చేసే నోటిఫికేష¯న్‌ జీవితకాలం కేవలం మూడేళ్లు మాత్రమే. ఈ విషయాలన్నీ వారికి వివరించి వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఏలూరు జిల్లాలో సీఎం జగన్‌తో కరచాలనం కోసం యువత ఉత్సాహం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement