చంద్రబాబు కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం | CM YS Jagan Bhoomi Puja For Reconstruction Of 9 Temples In AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం

Jan 9 2021 3:18 AM | Updated on Jan 9 2021 9:03 AM

CM YS Jagan Bhoomi Puja For Reconstruction Of 9 Temples In AP - Sakshi

విజయవాడలో తొమ్మిది ఆలయాల పునర్నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, దుర్గమ్మ ప్రసాదాన్ని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: విజయవాడలో గత ప్రభుత్వ హయాంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన గావించింది. ఆగమ పండితులు నిర్ణయించిన 11.01 గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు ధరించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునః నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో (రూ.7 కోట్లు ఆలయాలవి) రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ఆయా పనులకు సంబంధించి రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. 20 నిమిషాలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది. భూమి పూజ అనంతరం సీఎం జగన్‌.. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత దుర్గమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు, ఘనాపాటీల ఆశీర్వచనం అనంతరం సీఎం జగన్‌.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 
ఆలయాల పునర్నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

దేవదాయ శాఖ వార్షిక క్యాలెండర్‌ ఆవిష్కరణ
► రాష్ట్ర దేవదాయ శాఖ రూపొందించిన 2021 వార్షిక క్యాలెండర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రత్యేకత ప్రతిబింబించేలా, ఆయా ఆలయాల దేవతా మూర్తులు, ఆ ఆలయాల పరిధిలో నిర్వహించే వేడుకల వివరాలతో దేవదాయ శాఖ ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. 
► రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి సంబంధించిన రూట్‌ మ్యాప్‌ తయారు చేసి, అమలుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

నాడు వైఎస్సార్‌.. నేడు వైఎస్‌ జగన్‌
► వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.33 కోట్లతో దుర్గ గుడి మహారాజ గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కొండపై ఆలయ అభివృద్ధికి నాంది పలికిన విషయాన్ని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అప్పటి శిలాఫలకాన్ని చూపించారు. 
► దివంగత సీఎం వైఎస్సార్‌ తనయుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా రూ.77 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం విశేషమని అర్చకులు కొనియాడారు. 
► దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబం 28.380 గ్రాముల బరువున్న రూ.6.50 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ముక్కుపుడక (నత్తు), బులాకీని కనకదుర్గమ్మకు కానుకగా సీఎం చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, దుర్గ గుడి పాలక మండలి చైర్మన్‌ పైలా సోమి నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 

పునర్నిర్మిస్తున్న తొమ్మిది ఆలయాలు ఇవే..
రాహు – కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో), శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద), సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో), గోశాల కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement