నీటి బొట్టూ ఒడిసి పట్టి

CM Jagan urges International Commission on Irrigation to work on a solution for transferring water - Sakshi

సాగు నీరు, వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక దృష్టి

విశాఖ ‘ఐసీఐడీ’ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టి సాగు అవసరాలను తీరుస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. నీటి కొరతను అధిగ­మించేందుకు ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు నీటిని మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు.

ఏడాది­లో తక్కువ కాలం మాత్రమే కురిసే వాన నీటిని ఒ­డిసి పట్టి ఆయకట్టుకు అందించడం ద్వారా కరువు­ను సమర్థంగా నివారించవచ్చన్నారు. గురు­వారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ¯ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి సీఎం జగన్‌ ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 90 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణకు గట్టి కృషి చేస్తున్న ఐసీఐడీ సదస్సును రాష్ట్రంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ప్రశాంతమైన విశాఖ నగరం అతిథులకు చక్కటి అనుభూతి అందించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. నీటి నిర్వహణలో సరికొత్త మార్గాలపై సదస్సులో చర్చించడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సుస్థిర సాగు కోసం 
ప్రతిష్టాత్మక 25వ ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) సదస్సును ఈనెల 4 వరకు, 74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఐఈసీ) సమావేశాన్ని 5వ తేదీ నుంచి 8 వరకు మొత్తంగా ఎనిమిది రోజులపాటు అందమైన విశాఖ నగరంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణపై మా ప్రతిపాదనను అంగీకరించినందుకు ఇండియన్‌ నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ (ఐఎన్‌సీఐడీ), కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఐడీకి  చెందిన ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి కృతజ్ఞతలు. నీటి నిర్వహణ ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఈ ఫోరం నీటి పారుదల, డ్రైనేజ్, వరద నిర్వహణలో అందిస్తున్న సహకారం ప్రశంసనీయం.  

‘మోర్‌ క్రాప్‌ పర్‌ డ్రాప్‌’
వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ శతాబ్దాలుగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రధాన, మధ్య తరహా, చిన్న నదులు 40 వరకు ఉన్నాయి. కరువు పీడిత, మెట్ట ప్రాంతాలలో నీటి పారుదల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రధానమంత్రి సూచించిన విధంగా ‘మోర్‌ క్రాప్‌ పర్‌ డ్రాప్‌’ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. తద్వారా ప్రతీ నీటి బొట్టుకు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

దిగువ రాష్ట్రం కావడంతో
రాష్ట్రానికి సువిశాల తీర ప్రాంతం ఉన్నా రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాలు తక్కువ వర్షపాతం కారణంగా తరచుగా కరువు బారిన పడుతున్నాయి. ఆ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను ఇది దెబ్బతీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ దిగువ నదీ తీర రాష్ట్రం కావడంతో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన అంతర్రాష్ట్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు నీటి కొరత సమస్య ఎదురవుతోంది. అధిక వర్షాలు, వరదల వల్ల ఈ నదుల పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాం. సమర్థ నీటి పారుదల నిర్వహణ మాత్రమే దీనికి మంచి పరిష్కారం చూపుతుంది. 

అనుసంధానమే పరిష్కారం
నీటి కొరత గురించి ప్రస్తావించినప్పుడు మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్స్‌ గుర్తుకొస్తాయి. నీటిని ఎలా వినియోగించుకోవాలనేందుకు ఈ తరహా ఆలోచన­లు అవసరమే. అయితే నా ఉద్దేశం ప్రకారం వర్షా కాలంలో నీటి బదలాయింపు అంశంపై మరింత విస్తృతంగా చర్చ జరగాలి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు వర్షా కాలం. ఈ సీజన్‌లో వర్షాలు కురిసి  నదులు వరదతో ప్రవహిస్తూ ఉంటాయి.

వర్షాలు కురిసే కాలం తక్కువగా ఉన్నా వర్షపాతం అధికంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నీటిని ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు తరలించడం సవాల్‌తో కూడుకున్నది. అయినప్పటికీ దీని ద్వారా మాత్రమే  వ్యవసాయ రంగంలో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చన్నది నా గట్టి నమ్మకం. నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ఒక బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌కు నీటిని తరలించగలిగితే ఆయా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు. కాలువల ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఒక బేసిన్‌ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించగలుగుతాం. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నా. 

ఆమోదయోగ్య మార్గాలపై దృష్టి
నీటి నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చిస్తారని భావిస్తు­న్నా. అయితే సాంకేతికంగా సాధ్యం కావడంతో పాటు ఆర్థికంగా లాభదాయకమైన పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ పరిష్కారాలు సామాజికంగా ఆమోదయోగ్యంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నా. నీటి పారుదల, వరద నిర్వహణ రంగాలపై ఈ సదస్సులో జరిగే చర్చలు,  ఆలోచనలు, సిఫారసులు భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని గాఢంగా విశ్వసిస్తున్నా.

ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డెల్టా రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డుల కోసం అందిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి నాలుగు నిర్మాణాలకు ఈ అవార్డు దక్కింది. అందులో  ప్రకాశం బ్యారేజీకి చోటు దక్కింది. విశాఖలో ఐసీఐడీ సదస్సు సందర్భంగా అవార్డును జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, సీఎం జగన్‌ కలసి అందించారు. తమిళనాడులోని శ్రీవైకుంఠం ఆనకట్ట, ఒడిశాలోని బలిదా ఇరిగేషన్‌ జయమంగళ ఆనకట్టలకు కూడా ఈ అవార్డులు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top