సీఎం భరోసా.. దొరికింది ఆసరా

CM Jagan Support To physically handicapped Young Man - Sakshi

కాన్వాయ్‌లో వెళ్తూ నిస్సహాయ స్థితిలో యువకుడిని గమనించిన సీఎం జగన్‌ 

సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన కలెక్టర్‌ ఢిల్లీ రావు

యువకుడికి ఆస్పత్రిలో చికిత్స.. తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కు అందజేత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలో బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ ముగించుకొని సీఎం తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక యువకుడిని గమనించారు. వెంటనే అతడి వైపు సీఎం తన చేయి చూపుతూ తాను ఉన్నాననే భరోసాను కల్పించారు. వెంటనే అతడి సమస్య ఏమిటో ఆరా తీయాలని తన సెక్యూరిటీ సిబ్బందిని సీఎం ఆదేశించారు.

అలాగే అతడి వివరాలను తక్షణమే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తూ కూడా ఆ యువకుడి విషయం ఎంతవరకు వచ్చిందని సీఎం జగన్‌ మరోసారి ఆరా తీశారు. యువకుడికి అవసరమైన సాయం అందేలా.. వైద్యానికి అవసరమైన ఖర్చును అంచనా వేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన విజయవాడ కలెక్టర్‌ ఢిల్లీ రావు స్వయంగా తన వాహనాన్ని యువకుడి ఉన్న చోటుకు పంపి అతడిని తన కార్యాలయానికి రప్పించారు. అతడి పరిస్థితిని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే డీఎంహెచ్‌ఓను పిలిపించి చికిత్స నిమిత్తం యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద రూ.లక్ష చెక్కును సైతం కలెక్టర్‌ ఢిల్లీ రావు అందజేశారు.  

సీఎం అండ.. తీరింది బెంగ.. 
ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఏసుబాబు, శివగంగల దంపతుల కుమారుడు లక్ష్మణ్‌ (20)కు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. అప్పట్లో 71 రోజులు ఆస్పత్రిలోనే వైద్యం పొందినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. లక్ష్మణ్‌ కాలు చచ్చుపడిపోయింది. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు తమకు శక్తికి మించి వైద్యం చేయించారు. అయితే ప్రతి నెలా మందులకు రూ.10 వేలు వెచ్చించడం భారంగా మారింది.  

మిగిలిన ఇద్దరు కుమారులు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని బుధవారం బాధితుడు లక్ష్మణ్‌ తన తల్లిదండ్రులతో విజయవాడ వచ్చాడు. సీఎం అండతో  సమస్య పరిష్కారమైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top