Azadi Ka Amrit Mahotsav: ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

CM Jagan Says Har Ghar Thiranga Program Celebarations In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై ముఖ్యమంత్రులతో సమీక్ష జరిపింది. కాగా, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంఫ్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో ఏపీలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్బంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు జరపనున్నట్టు వెల్లడించారు.  

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంపై సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

– ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సమగ్రమైన కార్యాచరణను రూపొందించింది. 
– పలు ప్రభుత్వ విభాగాలతో పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించాం. 
– ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించాం. 
– పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించాం. చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం.
– రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా  జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచాం.
– సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు  జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించాం. 
– ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం.
– 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు.
– 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు
– ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top