సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి

CM Jagan Review Meeting On Welfare Hostels And Gurukul Schools - Sakshi

అన్ని హాస్టళ్లలో పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం

సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడుపై సమీక్షలో సీఎం జగన్‌ 

పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడంపై దృష్టి పెట్టాలి

హాస్టళ్లలో కూడా మెనూ జగనన్న గోరుముద్దలా ఉండాలి

వీటన్నింటిపై పక్కాగా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితులను సమూలంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్‌లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఆ విధంగా మన సంక్షేమ హాస్టళ్లను మార్చాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడు అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.

నాడు–నేడులో భాగంగా హాస్టళ్లలో పూర్తి వసతులు కల్పిస్తాం. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత (శానిటేషన్‌), చక్కటి వాతావరణం, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలి. బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు కల్పించాలి. 
ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. మెనూ ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా ఉండాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్‌ విద్యార్థులకు కూడా ఇస్తాం. కాబట్టి హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. 
పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనేదానిపై ఆలోచన చేయాలి. దీనిపై మనం ఏది చెప్పినా, తప్పనిసరిగా అమలు చేయాలి. వీటన్నింటిపై పక్కాగా ప్రణాళిక రూపొందించి వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. (సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం)

4,472 హాస్టళ్లలో 4,84,862 మంది విద్యార్థులు
రాష్ట్రంలో సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4,772 హాస్టళ్లు ఉండగా, 4,84,862 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల హాస్టళ్లు సొంత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేస్తామన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top