చెప్పినదానికన్నా మిన్నగా బీసీలకు గౌరవం

CM Jagan‌ given huge priority for BCs - Sakshi

బీసీలకు సీఎం జగన్‌ సముచిత ప్రాధాన్యం

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో వర్చువల్‌ సమావేశంలో వక్తలు

సాక్షి, అమరావతి: అధికారంలోకి రాక ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పిన దాని కన్నా మిన్నగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు రాష్ట్రంలో బీసీలకు గౌరవం కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. ఒక సామాన్య బీసీ కులంలో పుట్టిన తనను డిప్యూటీ సీఎం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లతో సోమవారం జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మేమెందుకు బీసీలుగా పుట్టలేదా అని మిగిలిన కులాల వారు అసూయ చెందేలా రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలవుతోందని చెప్పారు. బీసీలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం బీసీలుగా మనపైనే ఉందన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మనం మన కులాలను అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటూనే మరో పక్క సీఎంకి అండదండలు అందిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు.

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ  బీసీలకు ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరన్నారు. బీసీలు ఉన్నతస్థాయికి ఎదిగేలా వారికి అన్ని రంగాల్లో సీఎం జగన్‌ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బీసీ కార్పొరేషన్‌ చైర్మన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.

బీసీ కార్పొరేషన్‌ కార్యాలయాలను బుధవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, గ్రూపు రాజకీయాలకు అతీతంగా ఆయా కులాల సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషిచేస్తూనే బలమైన నాయకులుగా ఎదగాలని కోరారు. మీటింగ్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top