
విహార యాత్రలా సీఎం చంద్రబాబు బృందం పర్యటన
ఎటువంటి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో ఇంటికి
సింగపూర్ వెళ్లి విశాఖ పెట్టుబడి సమావేశాలకు రావాలని ఆహ్వానం
తెలుగు సినిమా దర్శకుడు తేజతో సింగపూర్‌లో ఒప్పందం
పచ్చపత్రికల ప్రచారానికే మొన్న దావోస్ నేటి సింగపూర్ పర్యటనలు
సింగడు అద్దంకి పోనూ పోయాడు రానూ వచ్చాడు అన్న సామెతను నిజం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన సాగింది. భారీ బృందంతో వెళ్లి రిక్తహస్తాలతో తిరిగొచి్చంది. సీఎం చంద్రబాబు , మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్, పలువురు సీనియర్ అధికారుల బృందంతో ఐదు రోజుల పాటు విహార యాత్రలాగా పర్యటన చేశారే కానీ రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఒక్క కీలక ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు.
నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటికే అనేకసార్లు చూసిన సింగపూర్‌కు మళ్లీ వెళ్లి అవే పోర్టులు, భవనాలను చూసి ఆ దేశ వైభవం గురించి 2014–19 మధ్య చెప్పినట్టే ఇప్పుడూ అమరావతిని సింగపూర్ చేస్తాను, రివర్‌ఫ్రంట్ నగరం కడతాను అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు. సాధారణంగా ఏదైనా దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ వివరాలను సుదీర్ఘంగా వివరించడం చంద్రబాబుకు అలవాటు. అలాంటిది ఈసారి విలేకరుల సమావేశం పెట్టకుండా సమీక్షలతో సరిపెడుతూ ముఖం చాటేశారు. దీన్నిబట్టే సింగపూర్ పర్యటన ఎంత ఘోరంగా జరిగిందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. – సాక్షి, అమరావతి
మీకో నమస్కారం.. కలిసి పనిచేయలేం..
రాష్ట్ర ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మీతో స్నేహం చేసిన తర్వాత మా దేశ మంత్రి ఏకంగా అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, అలాంటివారితో ఇక తాము కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పింది. అతిథిలాగా గౌరవించి ముఖస్తుతి కోసం మీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారే కానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.
చివరకు చంద్రబాబు చేసేది ఏమీ లేక నవంబరులో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు రండి అంటూ ఆహ్వానించి మెల్లగా జారుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే ఎప్పటిలాగానే తన అనుకూల మీడియాలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఏపీ బ్రాండ్‌ను చంద్రబాబు పునరుద్ధరిస్తున్నారంటూ పేజీల పేజీల కొద్దీ కథనాలు వండివార్చి ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు.
బాబూ ఇదేమి చిత్రం
చిత్రం, జయం, నిజం వంటి పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగువాడైన తేజతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సింగపూర్‌లో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అక్కడి కంపెనీలు ముందుకురాకపోవడంతో తేజ డైరెక్టర్‌గా ఉన్న టెజారాక్ట్ యూఎస్ ఐఎన్‌సీతో కంటెంట్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కాగా, సీఎం బృందం సింగపూర్ పర్యటనలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సింగపూర్ యూనిట్‌లో తెలుగు అమ్మాయి ఏఐ క్లౌడ్ టీమ్‌లో ఉద్యోగం చేస్తోంది.
ప్రవాసాంధ్రుల ముఖాముఖిలో ఆమె మాట్లాడుతూ రోల్స్ రాయిస్‌ను ఏపీకి తెచ్చే విధంగా కంపెనీ ప్రధాన కార్యాలయంతో మాట్లాడతానని చెప్పడం, ఆ విషయాన్ని ఇక్కడి పత్రికలు రోల్స్ రాయిస్ ఏపీకి వచ్చేస్తున్నట్లు కథనాలు ప్రచురించడం గమనర్హం. ఇదంతా సరిపోయారు ఇద్దరకు ఇద్దరు అన్న చందంగా ఉందంటూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
రోల్స్ రాయిస్ వంటి ప్రసిద్ధ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టే పెట్టుబడిపై ఒక సాధారణ ఉద్యోగి మాట్లాడే అవకాశం ఉంటుందా? కానీ, అలాంటి వ్యాఖ్యలకు కూడా పచ్చ మీడియాలో భారీ ప్రచారం కల్పించారంటే తమ వాళ్ల ప్రచార పిచ్చికి అది పరాకాష్ఠ అని టీడీపీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు.
దావోస్ సదస్సుకు ముందు సైతం పెట్టుబడుల కోసం వేట అంటూ ప్రచారం కల్పించారని, ఇప్పుడు కూడా సింగపూర్ పర్యటనపై ఊదరగొట్టారని పేర్కొన్నారు. తీరా చూస్తే అప్పటిలాగానే ఖాళీ చేతులతో తిరిగిరావడంతో కూటమి నేతలు నైరాశ్యంలోకి జారిపోయారని వివరించారు. కాగా, సింగపూర్ పర్యటనపై మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్‌లో పోర్టులు, రియల్ ఎసేŠట్‌ట్, భవనాలు, డేటా సెంటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పడం కొసమెరుపు.