
కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అసంతృప్తి
రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలపై ఫీడ్‌బ్యాక్ బాగోలేదు
పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు
సమాచారం అంతా ఆర్టీజీఎస్‌లో.. కలెక్టర్లను నివేదికలు అడగొద్దు
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం
రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు
రూ.1,000 కోట్ల రెవెన్యూ కోల్పోయి ఉచితంగా ఇసుక ఇస్తున్నామన్న సీఎం
శాంతి భద్రతలపై రహస్య సమీక్ష.. అక్రమ కేసులకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టినా ఇప్పటికీ కొన్ని శాఖలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయని ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలకు రేటింగ్ ఇస్తున్నామని, ఇప్పటికీ ఈ మూడు శాఖలు పనులు కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నట్లు ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని, అమెరికా నుంచి 750కిపైగా తప్పుడు పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రెండో రోజు మంగళవారం క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. సీనియర్ అధికారులు కూడా పని విధానం మార్చుకోవాలని, ఇకపై టెస్టుల్లో పాసైన వారినే కీలక పదవుల్లో కూర్చోబెడతానని సీఎం అన్నారు.
టెక్నాలజీపై అవగాహన ఉన్న యువ ఐఏఎస్ అధికారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టినట్లు చెప్పారు. టీచర్ల దగ్గర నుంచి ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఐటీపై అవగాహన పెంచుకోవాల్సిందేనన్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి క్షేత్ర స్థాయి సమాచారం కోసం కలెక్టర్లను నివేదికలు అడగకూడదని, కావాల్సిన వివరాలన్నీ ఆర్టీజీఎస్ నుంచే తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఫైల్స్ ఆడిటింగ్ చేస్తాం
రెండు నెలల్లో ఫైళ్లన్నీ 100 శాతం ఆన్‌లైన్ చేయాల్సిందేనని, మానిప్యులేషన్‌కు తావు లేకుండా ఫైళ్లపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే క్షణాల్లో పట్టుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేలా బ్రాడ్ కాస్ట్ సిస్టమ్‌ను అన్ని కీలకప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పే రివర్‌ఫ్రంట్ క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్లపై అభిప్రాయాలు చెప్పాలని కలెక్టర్లను కోరారు.
2027లోపు రీ సర్వే పూర్తవ్వాలి..
2027 లోపు భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం ఆర్‌ఓఆర్‌కు సంబంధించినవే ఉంటున్నాయన్నారు. గత ప్రభుత్వం భూములను కాజేయడానికి 22ఏ జాబితాలో పెట్టిందని విమర్శించారు. కుల ధ్రువీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలన్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నుల తగ్గింపుపై ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందో 22 నుంచి అక్టోబరు 22 వరకూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ ఆదాయం కొన్ని జిల్లాల్లో గణనీయంగా పడిపోవటానికి కారణాలను విశ్లేషించాలన్నారు.
నేటి నుంచి 2 వరకూ స్వచ్ఛతాహీ సేవ
జనవరి నుంచి వేస్ట్ (చెత్త) ఎక్కడా కనిపించకూడదని, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు రాష్ట్రమంతా వర్తింప చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదని, ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలన్నారు. స్వచ్ఛతాహీ సేవ సెపె్టంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో ఘన వ్యర్ధాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. 2029కి పచ్చదనం 39 శాతానికి పెరగాలన్నారు.
యూరియాపై దుష్ప్రచారం..
రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తేవాలని యత్నించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో విశ్లేషించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరాలు 16 శాతం పెరిగాయని చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సైబర్ నేరాలతో ప్రజలు నెలకు రూ.30 కోట్లు నష్టపోతున్నారన్నారు. పోలీసులు మరింత అడ్వాన్స్‌గా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
శాంతి భద్రతలపై రహస్య సమీక్ష
కలెక్టర్ల సదస్సుకు డుమ్మా కొట్టిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత నియోజకవర్గం ఆత్మకూరులో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయన లేకుండానే దేవదాయ శాఖపై సమీక్షను చంద్రబాబు నిర్వహించడం గమనార్హం. ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటనలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిరోజు సదస్సుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
కలెక్టర్ల సదస్సును లైవ్ టెలికాస్ట్ చేసిన ప్రభుత్వం శాంతి భద్రతలపై సమీక్షను మాత్రం రహస్యంగా నిర్వహించింది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ సోషల్ మీడియాలో తటస్థులు పెడుతున్న పోస్టులపై కేసులు పెట్టాలని ఈ రహస్య సమావేశంలో ఎస్పీలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎలాంటి వారిపైనైనా కేసులు మోపి జైల్లో పెట్టాలని, ఇతర మీడియాను పూర్తిగా అణగదొక్కాలని పరోక్షంగా సంకేతాలు ఇచి్చనట్లు సమాచారం.