భూముల రీ సర్వేపై విస్తుగొలుపుతున్న సీఎం చంద్రబాబు వైఖరి
రాష్ట్రంలో అద్భుతంగా రీ సర్వే చేశామంటూ రూ.400 కోట్ల రాయితీ కోరిన వైనం
వాస్తవంగా వైఎస్ జగన్ హయాంలో చేసిన రీ సర్వేపై కేంద్రం ప్రశంసలు
ఓ వైపు రీ సర్వేపై బురదజల్లుతూ మరో వైపు సర్వే బాగా చేశామని కేంద్రం వద్ద బాబు బిల్డప్పులు
తాము చేసిన సర్వే వల్లే రాయితీలు వచ్చాయని అబద్ధాలు ప్రచారం
ఈ సర్వే కోసం జగన్ హయాంలో 3,240 జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్లు, 200కు పైగా డ్రోన్లు, 70 కార్స్ స్టేషన్లు
రోవర్ నెట్‌వర్క్ ద్వారా అత్యంత కచ్చితత్వంతో ఇదివరకెన్నడూ లేని విధంగా భూముల సర్వే
వీటన్నింటి ద్వారా రాష్ట్రంలో 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో పూర్తి
విప్లవాత్మక రీతిలో సాగిన ఈ కార్యక్రమానికి గుర్తుగా గ్రానైట్‌తో హద్దుల్లో సర్వే రాళ్లు
ఎప్పుడు సర్వే జరిగిందో గుర్తుండేలా లోగో ముద్రణ.. వీటన్నింటిపై నాడు బాబు దుష్ప్రాచారం
కేంద్రం ప్రశంసలతో ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే టెక్నాలజీతో సర్వే కొనసాగింపు
క్యూ ఆర్ కోడ్ విధానం కూడా చోరీ.. కేంద్రం ప్రశంసలను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు
జగన్‌ప్రభుత్వం చేస్తున్న రీ సర్వే వల్ల రైతులకు నష్టం. మీ భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని ఆక్రమిస్తారు.. ఇక మీ భూములు మీవి కావు.. రీ సర్వే నెపంతో అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తెలుసుకోవడం కోసమే ఈ సర్వే చేస్తున్నారు.. మేము అధికారంలోకి రాగానే రీ సర్వేను ఆపేస్తాం.. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపండి. - ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్‌కో దుష్ప్రచారం
ఆంధ్రప్రదేశ్లో రీ సర్వే అద్భుతం.. రీ సర్వే చాలా బాగా జరిగింది.. ఇంకా జరుగుతోంది.. ఆధునిక టెక్నాలజీ వాడుతున్నాం.. ఇప్పటికే సగానికిపైగా గ్రామాల్లో పూర్తి చేశాం.. ఏడాదిలోగా భూ సమస్యలే లేకుండా చేస్తాం.. రీ సర్వే వల్ల రైతులకు ఎంతో లాభం.- సీఎం హోదాలో కేంద్రానికి రాసిన లేఖలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: నాడు దుష్ప్రచారంతో భూముల రీ సర్వేను అడ్డుకుని, ఇప్పుడు దాని క్రెడిట్‌ను చోరీ చేస్తుండడం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయింపు మొదలు పెట్టారు. అసలు విషయాలపై మాట్లాడకుండా తానే భూముల రీ సర్వే చేయిస్తున్నానని, పట్టాదార్ పాస్‌పుస్తకాలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెబుతున్నారు. ఎన్నికలకు ముందు భూముల రీ సర్వేను అడ్డుకున్న చంద్రబాబు.. విపరీతమైన దుష్ప్రచారం చేసిన విషయం జగమెరిగిన సత్యం.
కానీ ఇప్పుడు దానిపై ఆయన యూటర్న్ తీసుకుని, అది తన గొప్పేనని ప్రచారం చేసుకోవడంపై అధికారులు, ప్రజలు నివ్వెరపోతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2020లో ప్రారంభమై విజయవంతంగా జరిగిన భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చింది. నీతి ఆయోగ్ సైతం దాన్ని ప్రశంసించింది. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దేశానికి ఆదర్శంగా మారిన రీ సర్వేపై పనిగట్టుకుని బురదజల్లారు. రీ సర్వే చేసి భూములు దోచేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి విష ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక రీ సర్వే ప్రయోజనాలు గొప్పగా ఉండడం, కేంద్రం దాన్ని కొనసాగించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రూటు మార్చేశారు. ఏడాది పాటు రీ సర్వేను పూర్తిగా నిలిపివేసినా, చివరికి కొనసాగించారు.
రాయితీల కోసం యూటర్న్
భూ రికార్డులను ఆధునికీకరణ చేసే రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని, 50 ఏళ్లపాటు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని, రీ సర్వే అద్భుతమని కేంద్రానికి లేఖలు పంపారు. తమ రాష్ట్రంలో రీ సర్వే చాలా బాగా జరిగిందని, ఇంకా జరుగుతోందని, ఇప్పటికే సగానికిపైగా గ్రామాల్లో పూర్తి చేశామని.. ఇందుకు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నామని కేంద్రానికి తెలిపారు. అయితే అప్పటికే ఏపీలో జరుగుతున్న రీ సర్వేపై కేంద్రానికి స్పష్టంగా తెలిసి ఉండడంతో రీ సర్వేను ఆదర్శవంతంగా చేసినందుకు మొదటి విడతగా రూ.400 కోట్ల రాయితీని విడుదల చేసింది.
దాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ రీ సర్వే తానే చేస్తున్నానని ఎల్లో మీడియా తోడుగా డప్పు కొట్టుకుంటున్నారు. వాస్తవానికి ఆ నిధులు విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో రీ సర్వేను చంద్రబాబు నిలిపివేశారు. అది జగన్ కార్యక్రమమనే కారణంతో దాన్ని ఆపేసి రాష్ట్రంలో బురద జల్లుతూనే, ఢిల్లీలో మాత్రం దాని గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు రీ సర్వేను అరకొరగా చేస్తూ అది మొత్తం తన ఘనతేనంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. నిజానికి రీ సర్వే పేరుతో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవడం, పాతిన హద్దు రాళ్లను తొలగించడం మాత్రమే చేశారు.
నాడు రీ సర్వే ప్రత్యేకత తెలిసేలా గ్రానైట్ హద్దు రాళ్లు
రీ సర్వే చేశాక వైఎస్ జగన్ ప్రతి భూమి పార్సిల్ మ్యాప్ ప్రకారం హద్దు రాళ్లను పాతించారు. ఏ రాయి పడితే ఆ రాయి వాడితే సర్వే ప్రాధాన్యం, సర్వే చేసిన విషయం తెలియదని.. ఒక మార్క్‌గా, గుర్తుగా ఉండేలా గ్రానైట్ రాళ్లు వాడారు. దానిపై నవ రత్నాల లోగో వేశారు. రీ సర్వే ప్రత్యేకతను తెలిపేందుకు వందేళ్ల తర్వాత జరిగిన కార్యక్రమం కావడంతో దానిపై లోగోను స్పష్టంగా ముద్రించారు. దానిపై చంద్రబాబు ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి రాగానే వాటిని తొలగించారు. ఇప్పటికీ ఆ ప్రచారం చేస్తూనే రీ సర్వే ప్రయోజనాలను మాత్రం తనవిగా చెప్పుకుంటున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌లు ముద్రించే విధానాన్ని తామే తీసుకువచ్చామని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే
అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వేను ఒక మహా క్రతువులా చేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్‌లు ముద్రించి కొత్త విధానానికి నాలుగున్నరేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. దీని వెనుక పెద్ద టెక్నాలజీ వ్యవస్థనే అప్పట్లో వైఎస్ జగన్ ఏర్పాటు చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరం పని చేసే శాశ్వత జీఎన్‌ఎస్‌ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) రిసీవర్ల వ్యవస్థగా పని చేస్తాయి. ఈ స్టేషన్లు ప్రతి క్షణం ఉపగ్రహ డేటాను సేకరించి సెంట్రల్ సర్వర్‌కి పంపుతాయి.
దీని ద్వారా భూమిపై నిర్దేశిత స్థానం కచ్చితంగా తెలుస్తుంది. సర్వేయర్లు సొంత బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోకుండానే సెంటీమీటర్ స్థాయి కచ్చితత్వంతో భూములను కొలుస్తారు. ఈ టెక్నాలజీతోనే జగన్ హయాంలో రాష్ట్రంలోని 13,500 గ్రామాలకు గానూ 6,800 గ్రామాల్లో సర్వేను అన్ని దశల్లో పూర్తి చేశారు. అక్కడ ఇప్పుడు కొత్తగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లు, పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్‌లు, జియో హద్దులు ముద్రించారు. ఇవన్నీ గతంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన అత్యాధునిక టెక్నాలజీ ఫలితమే. దాన్ని కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు వల్లె వేస్తున్నారు.
ఇదీ రీ సర్వే స్పెషాలిటీ
అత్యాధునిక టెక్నాలజీ అయిన జీపీఎస్‌ను కార్స్ (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) నెట్‌వర్క్‌లో ఉపయోగించి రీ సర్వే చేయించారు. ఇది 24 గంటలు పని చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రమంతా 70 కిలోమీటర్ల దూరంలో 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో సుమారు 150 శాటిలైట్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్‌ని ప్రతి బేస్ స్టేషన్ స్వీకరించి జియో కో ఆర్డినేట్స్‌ను సర్వే శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ చేసిన స్టేషన్‌కు పంపుతుంది.
200 వరకు డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, 2 విమానాలు, 3,240 జీఎన్‌ఎస్‌ఎస్ రోవర్లు సహాయంతో సర్వే చేశారు. ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌ను కేంద్రం కూడా వినియోగించుకుంటోంది. జగన్ తెచ్చిన ఈ వ్యవస్థను నేషనల్ ప్లాట్‌ఫాంకు అనుసంధానించేందుకు అంగీకరిస్తూ 2024 అక్టోబర్ 18న ఏపీ సర్వే శాఖతో సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇదీ రీ సర్వే స్పెషాలిటీ. అందుకే దాన్ని నాడు వ్యతిరేకించి అడ్డుకున్న విషయాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ఆరాట పడుతున్నారు.
విజనరీ సీఎం జగన్ వల్లే ఏపీలో రీ సర్వే
ఎస్‌వీ సింగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్
2023 నవంబర్ 22న శ్రీకాకుళం జిల్లా నర్సీపట్నంలో రీ సర్వే రెండవ దశ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో అప్పటి సీఎం జగన్‌తో కలిసి, అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్‌వీ సింగ్ పాల్గొన్నారు. ఆ సభలో సింగ్ మాట్లాడుతూ ఒక విజనరీ సీఎం ఉండడం వల్లే దేశంలో ఇంత వరకు ఎక్కడా జరగని విధంగా ఏపీలో భూముల రీ సర్వే జరుగుతోందని స్పష్టం చేశారు. దేశంలో భూ రికార్డుల పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని, వాటిని మార్చాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నా సాధ్యం కాలేదన్నారు.
కానీ జగన్ నేతృత్వంలో ఏపీలో 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రతి భూమికి మ్యాప్ తయారు చేశారని, దేశంలో ఇదొక మైలు రాయి అని చెప్పారు. దేశంలో భూ రికార్డులు సరిదిద్దిన మొదటి రాష్ట్రం ఏపీయేనని తెలిపారు. సీఎం స్వయంగా నిరంతరం పర్యవేక్షణ చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లు, విమానాలతో భూముల సర్వే చేయడం దేశంలో ఎప్పుడూ జరగలేదని, ఏపీలో మొదటిసారి జరిగిందన్నారు. ఈ మోడల్‌ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఏపీ రీ సర్వే దేశానికి ఆదర్శం
అజయ్ తిర్కీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి
2023 అక్టోబర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ (భూ వనరుల శాఖ) కార్యదర్శి అజయ్ తిర్కీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో పర్యటించి భూముల రీ సర్వే క్షేత్ర స్థాయిలో ఎలా జరుగుతుందో పరిశీలించి అభినందించారు. ఏపీలో చేపట్టిన రీ సర్వే దేశానికి ఆదర్శమని కొనియాడారు. ఇతర రాష్ట్రాలకు ఇక్కడ జరుగుతున్న రికార్డుల డిజిటలైజేషన్ ఒక ఆదర్శమని, దీనివల్ల భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు.
అధునాతన టెక్నాలజీ వాడడం వల్ల సర్వేలో పారదర్శకత ఏర్పడిందన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ శాఖాధికారులు ఏపీకి వచ్చి ఇక్కడ జరుగుతున్న సర్వే విధానాన్ని పరిశీలించారు. సర్వే ఎలా చేయాలో తమకు నేర్పించాలని కోరడంతో ఏపీ సర్వే శాఖాధికారులు డెహ్రాడూన్ వెళ్లి రీ సర్వే జరుగుతున్న తీరును వివరించారు. 2020–2024 మధ్యలో భూ రికార్డుల ఆధునికీకరణకు సంబంధించిన అనుమానాలు, పరిశీలనలు వంటి దేనికైనా కేంద్రం ఏపీనే సంప్రదించేది.


