సమాజానికి మీరే మార్గదర్శకులు

CJI Ramana says Lawyers Guide Society They Should Solve Public Issues - Sakshi

మీ శక్తి సామర్థ్యాలను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించండి

న్యాయవాదులకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపు

సాక్షి, అమరావతి: న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులు తమ శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నన్నాళ్లు ఓ తెలుగువాడిగా న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని తెలిపారు. హైకోర్టులో కొత్త జడ్జీల నియామకాలు వీలైనంత త్వరలో పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. ఖాళీల భర్తీ విషయంలో హైకోర్టు సీజేకు లేఖ రాశామని, పేర్లు పంపితే ఆమోదిస్తామన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్‌ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం సంయుక్తంగా ఆదివారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సతీసమేతంగా హాజరయ్యారు.

కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె. జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి, ఇతర కార్యవర్గ ప్రతినిధులు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, బార్‌ కౌన్సిల్‌ ఇతర సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు  గజమాలలతో సన్మానించారు. శాలువాలు కప్పి జ్ఞాపికలు బహూకరించారు.

ఇతర న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ , హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాలను కూడా శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని న్యాయవాద సంఘాలకు చెందిన న్యాయవాదులు జస్టిస్‌ రమణను సన్మానించేందుకు పెద్ద సంఖ్యలో వేదికపైకి రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్కులు లేకుండా పైకి రావడం, ఒకరినొకరు తోసుకుంటూ వస్తుండటంతో జస్టిస్‌ రమణ ఒకింత అసహనం వ్యక్తంచేసి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు.

నేనేమీ సినిమా హీరోను కాదు
‘ఈ పర్యటనలో నాపై మీరు చూపిన ఆదరణ, అభిమానం, ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు. ప్రతీ ఒక్కరూ శాలువా కప్పాలని, దండ వేయాలని, ఫొటో తీసుకోవాలన్న తాపత్రయాన్ని పక్కన పెట్టండి. నేను ఇక్కడి వాడినే. నేనేమీ సినిమా హీరోను కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయ్యాక కొందరు నా ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, కోవిడ్‌ కారణంగా అది సాధ్యపడలేదు. మనం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే మళ్లీ కోవిడ్‌ విజృంభించే ప్రమాదం ఉంది’.. అని న్యాయవాదులకు హితబోధ చేశారు.

ఎక్కువసేపు జరిగితే వారూ పారిపోవచ్చు..
‘మీరు నాపై ఎంత ప్రేమ కురిపిస్తున్నారో నాకు తెలుసు. గత మూడ్రోజులుగా వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. కొద్దిసేపట్లో గవర్నర్‌ వద్ద తేనీటి విందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది న్యాయమూర్తులు బిజీ షెడ్యూల్‌వల్ల అలిసిపోయారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ అలసిపోయి నావల్ల కాదంటూ హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సమావేశం ఎక్కువసేపు జరిగితే నా సహచర మిత్రులు జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది’.. అని జస్టిస్‌ రమణ అన్నారు.

ఇక అప్పటికే మ.3.30 గంటల సమయం కావడంతో కార్యక్రమానికి వచ్చిన వారు భోజనం చేయకపోవడంతో మిగిలిన న్యాయమూర్తులు ప్రసంగించే అవకాశం లేకుండాపోయింది. జస్టిస్‌ ఎన్వీ రమణ హైకోర్టు వద్దకు వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డ అమరావతి రైతులకు అభివాదం చేస్తూ హైకోర్టు ప్రాంగణం చేరుకున్నారు. కార్యక్రమానికి ముందు జస్టిస్‌ ఎన్వీ రమణ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రెండవ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు మీడియాను అనుమతించలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top