అదే సీఐడీ.. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది! | CID to protect Chandrababu from Fibernet Project | Sakshi
Sakshi News home page

అదే సీఐడీ.. ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది!

Dec 8 2025 3:14 AM | Updated on Dec 8 2025 3:14 AM

CID to protect Chandrababu from Fibernet Project

అప్పుడున్న సాక్ష్యాలు.. ఇప్పుడు ఏమయ్యాయి?

ఫైబర్‌ ‘నెట్‌’ నుంచి చంద్రబాబు రక్షణకు సీఐడీ ప్లేటు ఫిరాయింపు 

చార్జ్‌షిట్‌ దాఖలైన తర్వాత క్లోజర్‌ రిపోర్ట్‌.. నిబంధనలను పక్కనబెట్టిన దర్యాప్తు సంస్థ 

ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతంరెడ్డి 

క్లోజర్‌ రిపోర్ట్‌ విషయంలో నోటీసు ఇచ్చింది మరొకరికి.. 

దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సీఐడీ 

తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన గౌతంరెడ్డి

సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు నాయుడు 2014–19 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్‌ నెట్‌ టెండర్ల ప్రక్రియలో జరిగిన కోట్ల రూపాయల అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు అక్రమాలకు నాడు అన్ని సాక్ష్యాధారాలను సంపాదించి చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీఐడీ, ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లేవని... ఆ కేసు మూసివేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

చంద్రబాబు అడుగులకు మడుగులు..
2014–19 మధ్య సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పలు కుంభకోణాలపై గత ప్రభుత్వం హయాంలో సీఐడీ అన్నీ సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసుల నుంచి బయట పడేందుకు తనకే సొంతమైన ‘మేనేజ్‌’ స్కిల్స్‌కి చంద్రబాబు మరోసారి పదును పెట్టారు.  సీఐడీ సైతం ఆయన అడుగులకు మడుగులొత్తుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, షాడో సీఎం లోకేశ్, వారి ఆస్థాన సీనియర్‌ న్యాయవాదుల కనుసన్నల్లో సీఐడీ పనిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సేకరించిన సాక్ష్యాధారాలను మూలనపడేసి చంద్రబాబుపై కేసుల మూసివేతే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏపీ ఫైబర్‌ నెట్‌ టెండర్ల అక్రమాల కేసులో సీఐడీ కూడా ఇదే పనిచేస్తోంది. 

కంచే చేనుమేస్తున్న చందం
నిబంధనల ప్రకారం ఏదైనా కేసు మూసివేత కోసం చర్యలు చేపట్టాలంటే పోలీసులు ముందుగా ఫిర్యాదుదారుకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.  ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ అధికారులు ఇక్కడే మోసపూరితంగా వ్యవహరించారు. ఫైబర్‌ నెట్‌ అక్రమాలపై 2021లో అప్పటి ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి  ఫిర్యాదు చేశారు. అయితే ఆయనను పక్కనబెట్టి... ఫిర్యాదు­దారుగా ఫైబర్‌నెట్‌ అప్పటి ఎండీ మధుసూధన్‌­రెడ్డిని సీఐడీ అధికారులు తెరపైకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు..  గౌతంరెడ్డి పేరునే  ఫిర్యాదుదారుగా స్పష్టంగా పేర్కొనడం ఇక్కడ గమనార్హం.

అయితే చంద్రబాబుపై కేసు మూసివేసేందుకు ఫిర్యాదు­దారు అయిన గౌతంరెడ్డి అంగీకరించే ప్రసక్తే ఉండకపోవడంతో సీఐడీ చట్ట విరుద్ధ మార్గాన్ని ఎంచుకుంది. చంద్రబాబుపై ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసును మూసివేసేందుకు ఫైబర్‌నెట్‌ అప్పటి ఎండీ  మధుసూధన్‌రెడ్డిని ఫిర్యాదుదారుగా కోర్టుకు తీసుకొచ్చి కేసు మూసివేతకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించింది. చంద్రబాబు, సీఐడీ ఒత్తిడికి తలొగ్గిన మధుసూధన్‌రెడ్డి సైతం సీఐడీ చెప్పినట్లు చేశారు.

వాస్తవానికి ఇదే మధుసూధన్‌రెడ్డి ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీగా ఫైబర్‌నెట్‌ పనుల విషయంలో థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నిర్వహించారు. కాంట్రాక్ట్‌ పొందిన సంస్థ 80 శాతం పనులను పూర్తి చేయలేదని తేల్చారు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందని మధుసూధన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుపై కేసు మూసివేతకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం పలు అనుమానాలు కలిగిస్తోంది. సీఐడీ గతంలో సేకరించిన ఆధారాలకు మధుసూధన్‌రెడ్డి ఇప్పుడు చెబుతున్న దానికి పొంతనే లేదు.

నేడు విచారణ 
చంద్రబాబుపై కేసు మూసివేత కోసం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌పై గౌతంరెడ్డి ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫైబర్‌ నెట్‌ కుంభకోణం ఎలా జరిగింది.. ఎంత మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.. తదితర వివరాలను అందులో పొందుపరిచారు. సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌ని పరిగణనలోకి తీసుకునే ముందు ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై సీఐడీ సేకరించిన ఆధారాలను, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో ఏసీబీ కోర్టును కోరారు.

పరపతి కలిగిన వ్యక్తులను రక్షించేందుకు సీఐడీ దాఖలు చేసిన ఈ క్లోజర్‌ రిపోర్ట్‌ని తిరస్కరించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. గౌతంరెడ్డి దాఖలు చేసిన ఈ ప్రొటెస్ట్‌ పిటిషన్‌తో పాటు సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌పై ఏసీబీ కోర్టు సోమవారం విచారణ జరపనుంది. సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం వెలువరించే ముందు గౌతంరెడ్డి ప్రొటెస్ట్‌ పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుంది.

చంద్రబాబు కుయుక్తులకు నిదర్శనం
తన అవినీతిపై ఎప్పుడు కేసులు నమోదైనా అవి అసలు విచారణ వరకూ రాకుండా..  సాంకేతిక కారణాలతో కొట్టేయించుకోవడమో, మూసివేయించు­కోవడమో చంద్రబాబుకు అల­వాటు. తద్వారా ఆయన కేసుల నుంచి బయ­టపడుతున్నారు. ఇన్నేళ్లుగా ఆయన ఇదే చేస్తూ వస్తున్నారు. వ్యవస్థల్లో ఉన్న లొసుగులను తనకు అనుకూలంగా వినియోగించుకోవడంలో చంద్రబాబు కుయుక్తులకు ఇది తిరుగులేని నిదర్శనం. తాజా పరిస్థితిని చూస్తే.. తనపై నమోదైన పలు కుంభకోణాల కేసులను దర్యాప్తు చేస్తూ వచ్చిన సీఐడీ, ఏసీబీ అధి­కారులను చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మార్చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని ఏసీబీ, సీఐడీకి తెచ్చారు.  వారంతా  చంద్రబాబు పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుపై నమోదైన కుంభకోణాల కేసుల మూసివేతకు క్లోజర్‌ రిపోర్టులు దాఖలు చేయడం ప్రారంభించారు.

స్కామ్‌స్టర్‌ చంద్రబాబే..
కేంద్ర నిధులతో చేపట్టే ప్రాజెక్టులను కూడా అడ్డగోలుగా అస్మదీయులకు కట్టబెట్టి ప్రజా­ధనా­న్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్‌మైండ్‌ అనడానికి ఫైబర్‌ నెట్‌ కుంభకోణమే తార్కాణం.  కేంద్రం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్లగొట్టా­రని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది.

అందుకే  ఏ1గా చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌­నెట్‌ కార్పొరేషన్, ఇన్‌క్యాప్‌ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతో­పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతో­పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి)  ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ 2024లో సమర్పించిన తన చార్జ్‌షీట్‌లో సవివరంగా వివరించింది. అక్రమాల పర్వం చూస్తే..

మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు  మొదటి దశలో రూ.333 కోట్ల మేర అక్రమాలు జరిగాయి.
 పక్కా పథకంలో భాగంగా హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ–గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యునిగా చేర్చారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధనను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ, హరికృష్ణ ప్రసాద్‌ను ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు.

ఇక ఎలాంటి మార్కెట్‌ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్‌ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమాంతంగా పెంచేశారు.  
ఈ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్‌ కంపెనీ ప్రభుత్వ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్‌ యంత్రాల సరఫరాలో విఫల­మవడం దీనికి కారణం. కానీ చంద్ర­బాబు ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు.

 అనంతరం పోటీలో ఉన్న పలు కంపె­నీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్‌ పవర్‌ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోనే లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. 
టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు.

టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్‌ కంపెనీ తమ కన్సా­ర్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్‌ సాధించేందుకుగాను వివిధ పత్రాలను ట్యాంపర్‌ చేశారు.  
 ప్రాజెక్ట్‌ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్‌ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవ­హరించింది. టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏ­మాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుప­యోగంగా మారాయి.

మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకా­రంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండి­యా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. 
 వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. 

 ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభు­త్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్‌ 
కంపెనీల ద్వారా తరలించారు.
 ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement