మాధవరెడ్డి ఇంట్లో నుంచి వస్తున్న సీఐడీ అధికారులు
మదనపల్లె ఆర్డీవో ఆఫీసు ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ బరితెగింపు
తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ నేత మాధవరెడ్డి ఇంటికి పోలీసులు.. కోర్టు సూచనలు పాటించకుండా.. వేధింపులే లక్ష్యంగా కుయుక్తులు
మంగళవారం బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా బాబు సర్కారు పన్నాగం.. మదనపల్లె ఘటనలో కుట్ర లేదని ప్రధాన నిందితుడి పాలీగ్రాఫ్ పరీక్షలో స్పష్టం
అయినా, ఉద్దేశపూర్వకంగా దానిని విస్మరిస్తూ రాజకీయ కక్షసాధింపు చర్యలు.. 16 నెలలైనా నిషేధిత 22ఏ భూముల విషయమై ఏమీ తేల్చలేకపోయిన దర్యాప్తు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత ఏడాది జూలై 21 రాత్రి జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో కుట్ర కోణం లేదని తేలినా చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధించాలని చూస్తోంది. కోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా అడుగడుగునా దారుణంగా వ్యవహరిస్తోంది. ఇందులోభాగంగా శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు మదనపల్లె వైఎస్సార్‌సీపీ నేత మాధవరెడ్డి ఇంటిపై దాడికి వెళ్లారు.
మాధవరెడ్డిపై ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం, ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటిలో ఒక కేసులో బెయిల్ రాగా, ఆర్డీవో కార్యాలయం కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై విచారణ జరగనుంది. ఈలోగానే సీఐడీ అధికారులతో అక్రమ అరెస్టులకు కుట్రలు చేయడం చంద్రబాబు మార్కు వేధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది.
చట్టప్రకారం వెళ్లాలని కోర్టు సూచించినా..
చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా బలవంతపు చర్యలు తీసుకోవద్దని... ఆర్డీవో కార్యాలయం కేసులో మాధవరెడ్డి అరెస్ట్‌కు సంబంధించి సీఐడీకి కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కేసులో తొలుత మాధవరెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు స్టే ఇచ్చింది. బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలన్న సూచనతో జిల్లా కోర్టుకు వెళ్లగా పిటిషన్ తిరస్కరణకు గురైంది. తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా పలుసార్లు విచారణ జరిగింది. మంగళవారం విచారణ ఉండగా సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ బృందం, స్థానిక పోలీసులు మదనపల్లెలోని మాధవరెడ్డి ఇంటికి వచ్చారు. తాళం వేసిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 2 గంటలు అక్కడే ఉన్నారు. మిద్దెపై అద్దెకు ఉన్నవారిని మాధవరెడ్డి గురించి ఆరా తీసి వెళ్లిపోయారు.
పాలీగ్రాఫ్ పరీక్షలో తేలినా...
ఏదైనా కేసులో అనుమానితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు చేసే పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలు అత్యంత కచ్చితత్వంతో ఉంటాయని పోలీసు వర్గాలే చెబుతాయి. కాగా, ఆర్డీవో కార్యాలయం కేసులో ప్రధాన నిందితుడు కార్యాలయ అప్పటి సీనియర్ అసిస్టెంట్ గౌతంతేజ్. సీఐడీ వినతి మేరకు నిరుడు నవంబర్ 26, 27న ఆయనకు అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు పాలీగ్రాఫ్ పరీక్షలు చేశారు. ‘‘అగ్ని ప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ తపస్విని ఫోన్ చేయడానికి ముందే మీకు తెలుసా? కార్యాలయంలోని సెక్షన్‌లో నిప్పు పెట్టింది మీరేనా? ఎవరితోనైనా కలిసి దీనికి పాల్పడ్డారా? ప్రమాదం కారణాలను దాచిపెడుతున్నారా?’’ అని ప్రశ్నించింది. వీటన్నిటికీ, ‘కాదు’ అని గౌతంతేజ్ స్పష్టం చేసినట్లు పాలీగ్రాఫ్ పరీక్షల నివేదిక చెబుతోంది. తద్వారా ప్రమాదంలో కుట్ర కోణం లేదని తేలిపోయింది.
వాంగ్మూలం సాకుతో... వేధింపులే లక్ష్యంగా...
గౌతంతేజ్ విషయంలో సీఐడీ తీరు దారుణంగా ఉంది. పాలీగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ కాలేదన్న నివేదికను సీఐడీ ఎస్పీకి సమర్పించిన 27 రోజుల అనంతరం చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 2024 డిసెంబర్ 30న అదుపులోకి తీసుకుని విచారించగా, మదనపల్లె ఘటనకు కొందరితో కలిసి కుట్ర పన్నినట్టు గౌతంతేజ్ వాంగ్మూలం ఇచ్చాడని, అదే రోజు అరెస్ట్ చేశామని సీఐడీ పేర్కొంది. ఇదంతా చూస్తుంటే, పాలీగ్రాఫ్ పరీక్షల్లో తేలిన నిజాన్ని కూడా సీఐడీ విస్మరిస్తోందని స్పష్టమవుతోంది.
ఘటన జరిగిన రోజు రాత్రి 10.40కు గౌతంతేజ్ ఆర్డీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చినట్లు ప్రాసిక్యూషన్ సమర్పించిన సీసీ కెమెరా ఫుటేజీల్లో ఉందని బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. కేసును పరిశీలించాక నిందితుడి వాంగ్మూలం తప్ప ఇతర ఆధారాల్లేవని, ఒకవేళ ఉంటే విచారణలో పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, గౌతంతేజ్ వాంగ్మూలాన్ని సాకుగా చూపుతూ పలువురిని నిందితులుగా చేర్చి సీఐడీ ద్వారా ప్రభుత్వం వేధిస్తోంది.
‘22ఏ’ భూములెక్కడ? మిథున్‌రెడ్డి సవాల్‌కు జవాబేది?
మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబు నుంచి కూటమి నేతల వరకు అందరిదీ ఒకటే పాట. అది... మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన 22ఏ ఫైళ్లు ఉన్నాయని, అందుకే దగ్ధం చేశారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. కానీ, 17 నెలలు దాటినా ఒక్క ఆధారమూ చూపలేకపోయారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించిన వ్యవస్థలు మదనపల్లెలో మోహరించి భూతద్దం వేసి గాలించినా అక్రమాలు నిరూపించలేకపోయారు.
ఇక చంద్రబాబు ప్రభుత్వం ఆరోపణలపై అçప్పట్లో ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబానికి ఉన్న భూములన్నీ సక్రమమేనని, వాటి వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా తెలియజేశామని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడితే నిరూపించాలని సవాల్ కూడా చేశారు. కానీ, ఇంతకాలమైనా అక్రమ కేసులతో వేధించడం మినహా 22ఏ భూముల వివరాలను ప్రభుత్వం చూపలేకపోయింది. దీంతో చంద్రబాబు కుట్ర ప్రజలకు అర్థమైపోయింది.
నకళ్లు ఉంటాయనే విషయాన్ని విస్మరించి మరీ...
రెవెన్యూ కార్యాలయం ఫైళ్లకు తహసీల్దార్, జాయింట్ కలెక్టర్, కలెక్టరేట్లలో నకళ్లు ఉంటాయి. వాటిని పరిశీలించి ఏమైనా భూముల అక్రమాలను వెలికితీయొచ్చు. వాస్తవానికి మదనపల్లె ఉదంతంలో 22ఏ భూముల అక్రమాలు లేవన్నది స్పష్టం. కానీ, ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ నేతలను వేధించే ఆయుధంగా చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటోంది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులు, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుతో పాటు మదనపల్లె, తిరుపతి, హైదరాబాద్ తదితరచోట్ల వారి ఇళ్లల్లో సోదాలు చేయించింది.
ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించేందుకు స్వయంగా సీఎం చంద్రబాబే కేసును సమీక్షించడమే కాక అప్పటి డీజీపీ ద్వారకాతిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌ను విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో మదనపల్లెకు పంపారు. అన్ని ముఖ్య శాఖల కార్యదర్శులు, ఉన్నతస్థాయి అధికారులనూ పంపించి కుట్ర కోణం ఆధారాలు సేకరించాలని ఒత్తిడి తెచ్చారు.
ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయింది గాక... పాలీగ్రాఫ్ పరీక్షలో నిజాలు వెల్లడైనా చంద్రబాబు ప్రభుత్వం ఇంకా కుట్రే అంటూ బుకాయిస్తోంది. మరోవైపు మదనపల్లె ఘటనపై ప్రధానంగా ఒక కేసు నమోదు చేశారు. తర్వాత అసలు సంబంధమే లేని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేపై దాడులు నిర్వహించి రిజిస్ట్రేషన్ పత్రాలు, రికార్డులపై కేసులు పెట్టారు. ఒక కేసుకు సంబంధించి పలు కేసుల నమోదు చెల్లదని న్యాయవాదులు చెబుతున్నారు.


