
అప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేయగలం
ఈ ఏడాది రూ.1,34,208 కోట్లు లక్ష్యం
బంగారం కొనుగోళ్లకు తగ్గట్లు పన్ను రావడం లేదు
ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ఎర్రచందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు
వివిధ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను మరింతగా అన్వేషించాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నా, పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు.
మద్యం సరఫరా, అమ్మకాల ట్రాకింగ్
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి, రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఏపీలో ఎందుకు తక్కువగా ఉందని ప్రశి్నంచారు. రాష్ట్రంలోని ఎర్ర చందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మేలా కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఇవ్వాలని చెప్పారు. ‘2025–26 సంవత్సరానికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,34,208 కోట్లు ఆర్జించాలన్నది లక్ష్యం. ఇది గత ఏడాది కన్నా 29 శాతం అధికం’ అని సీఎం చెప్పారు.