MLA Chevireddy Bhaskar Reddy: హమాలీగా మారి.. బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతి రూరల్: రాయల చెరువు సమీపంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు.
వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు.