
షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ప్రచారం
వివరణ తీసుకోకుండా చార్జ్‌మెమోలు జారీ
బాధ్యులు కోర్టుకు వెళితే తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు వీగిపోయే దుస్థితి
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు నీటిమీద బుడగల వంటివేనని వైద్యశాఖలో చర్చ నడుస్తోంది. వ్యవస్థీకృత కాపీయింగ్‌లో కీలకమైన వ్యక్తులను రక్షించేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధార్థ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన క్రమంలో ప్రిన్సిపల్, ఇన్విజిలేటర్‌లకు డీఎంఈ చార్జి మెమోలు ఇచ్చారు.
వాస్తవానికి కాపీయింగ్ ఘటన వెలుగు చూసిన వెంటనే ప్రిన్సిపాల్‌తోపాటు విధుల్లో ఉన్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వైద్యశాఖ ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఎవరికి నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. నిబంధనల ప్రకారం ఏదైనా ఆరోపణల్లో చార్జి మెమోల జారీ, సస్పెన్షన్, ఇతర చర్యలు తీసుకునే ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి. అలాకాకుండా నేరుగా చర్యలు తీసుకుంటే, ఉద్యోగులు కోర్టును సంప్రదిస్తే, ఆ చర్యలు వీగిపోతాయని పరిపాలన విభాగాల్లోని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సిద్ధార్థ కాపీయింగ్ ఘటనలో ప్రభుత్వ చర్యలు తూతూ మంత్రంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక విశ్వవిద్యాలయంపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు కాపీయింగ్ జరిగినప్పుడు విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విధుల్లో పాల్గొనకుండా చేసింది. ఈ కాపీయింగ్ వ్యవహారంలో కళాశాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కీలకపాత్ర పోషించాడని వెల్లడైంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఏవో స్థాయి అధికారి వైద్య విద్యార్థుల అడ్మిషన్లు, పరీక్షలు, ఇతర వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. సిద్ధార్థ కళాశాలకు ఏవో పోస్టు మంజూరు కాలేదు. దీంతో సదరు సీనియర్ అసిస్టెంట్ అకడమిక్ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడటంలో ఆరితేరాడు. కొద్దినెలల కిందట సదరు ఉద్యోగిని యూజీ అకడమిక్ వ్యవహారాల నుంచి తప్పించి, పారామెడికల్ వ్యవహారాలు అప్పగించారు. అయినప్పటికీ యూజీ అకడమిక్ విభాగం మొత్తం అతడి కనుసన్నల్లోనే నడుస్తోంది.
సుదీర్ఘకాలంగా అకడమిక్ వ్యవహారాలు చూడటంతో విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారులతోను సన్నిహిత సంబంధాలున్నాయి. వీరికి అనుకూలంగా ఉన్న వారికి ఇన్విజిలేటర్ విధులు వేసి పక్కాగా కాపీయింగ్‌కు తెరలేపినట్టు సమాచారం. ఇప్పటివరకు కళాశాలలోని మినిస్టీరియల్ స్టాఫ్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు, చార్జ్‌మెమోలు జారీచేయలేదు. మొత్తం వ్యవహారంలో కీలకమైన ఉద్యోగి అధికారికంగా ఎంబీబీఎస్ అకడమిక్ ఇన్‌చార్జిగా లేరు.
ఈ క్రమంలో అతనిపై చర్యలుంటాయా లేదా అనేది కళాశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక నుంచి ఇటు కళాశాల, అటు వర్సిటీలో కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించడం పోలీస్, ఇతర దర్యాప్తు సంస్థల విచారణతోనే సాధ్యం అవుతుంది. కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులను విచారిస్తే సూత్రధారులు పట్టుబడతారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు.