నాలుగో త్రైమాసిక వ్యయానికి రూ.13.66 కోట్లు విడుదల
సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ
గత మూడు త్రైమాసికాల్లో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెకు రూ.40.97 కోట్లు
మరోవైపు లోకేశ్, పవన్‌కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లలోనే చక్కర్లు.. వారి లెక్కలు తేలాల్సి ఉంది
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె ఖర్చు రూ.54.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీఎం చంద్రబాబు (వీవీఐపీ) వినియోగించిన ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లించేందుకు రూ.13,65,75,000 విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు కలిపి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు రూ.54.63 కోట్లు అయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు త్రైమాసికాలకు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లింపునకు రూ.40.97 కోట్లను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్‌తోపాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు.
దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. అందువల్లే ఏడాదిలోనే రూ.54.63 కోట్లు అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె వ్యయం ఇలా..
తొలి త్రైమాసికం రూ.19,12,05,000
రెండో త్రైమాసికం రూ.10,92,60,000
మూడో త్రైమాసికం రూ.10,92,60,000
నాలుగో త్రైమాసికం రూ.13,65,75,000
పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?
ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.
అయినా పవన్‌కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల వ్యయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెలకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.


