
మల్యాలలో ‘హంద్రీ–నీవా’ మోటార్ ఆన్‌చేసి నీటిని విడుదల చేసిన చంద్రబాబు
హంద్రీ–నీవా పథకాన్ని తానే చేపట్టి.. తానే పూర్తి చేశానంటూ రైతుల ఎదుటే పచ్చి అబద్ధాలు పలికిన సీఎం
ఏటా నీటిని విడుదల చేస్తున్న ఇన్‌చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు
ఇప్పుడు ఢిల్లీ నుంచి వాయుమార్గంలో మల్యాల వెళ్లి నీటిని విడుదల చేసిన చంద్రబాబు
తొలిదశ కాలువ విస్తరణ, రెండోదశ కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే డ్రామా
1996 లోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు రైతులను మభ్యపెడుతూ హంద్రీ–నీవాకు చంద్రబాబు శంకుస్థాపన
1999 ఎన్నికలకు ముందు మరోసారి రైతుల్ని మోసం చేస్తూ మళ్లీ పునాదిరాయి
40 టీఎంసీల సామర్థ్యంతో కూడిన సాగునీటి పథకాన్ని 5 టీఎంసీలకు కుదించి తాగునీటి పథకంగా మార్చేసిన చంద్రబాబు
2014–19 మధ్య నీటిని విడుదల చేయకుండా రైతులకు ద్రోహం
హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచిన వైఎస్ జగన్
తిరిగి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు కుదించి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి కాలువ విస్తరణ, రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మరో నాటకానికి తెరతీశారు. హంద్రీ–నీవా తొలిదశ పథకాన్ని 2012లోనే అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేసింది.ఏటా ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి లేదా ఆ జిల్లా ప్రజాప్రతినిధులో మల్యాల పంప్‌హౌస్ మోటార్లు ఆన్‌చేసి హంద్రీ–నీవా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడం రివాజు. కానీ.. సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మల్యాల చేరుకుని హంద్రీ–నీవా మొదటి దశ పంప్‌హౌస్(మల్యాల)లో మోటార్ ఆన్‌చేసి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హంద్రీ–నీవా పనులను తానే ప్రారంభించి.. తానే పూర్తి చేశానని చెప్పారు. కేవలం వంద రోజుల్లోనే కాలువ వెడల్పుతో పాటు లైనింగ్ పూర్తిచేసి నీటిని విడుదల చేస్తున్న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. శ్రీశైలం మల్లన్న వద్ద ప్రారంభమయ్యే నీటిని తిరుమల వెంకన్న వద్దకు తీసుకెళ్లి జలహారతి ఇస్తామన్నారు. రాయలసీమలో కనీసం రెండు మెట్ట పంటలకు నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పట్టపగలే కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు
కాగా.. హంద్రీ–నీవా పనులను తానే ప్రారంభించి.. తానే పూర్తి చేశానంటూ సీఎం చంద్రబాబు పట్టపగలే కళ్లార్పకుండా నిండు సభలో పచ్చి అబద్ధాలు వల్లె వేయడం చూసి రైతులు, అధికారులు నిర్ఘాంతపోయారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గతేడాది 1,575.62 టీఎంసీలు టీఎంసీల ప్రవాహం వచ్చి నప్పటికీ హంద్రీ–నీవా ద్వారా కేవలం 29.08 టీఎంసీలను మాత్రమే విడుదల చేయడం ద్వారా తమకు చంద్రబాబు సర్కారు చేసిన ద్రోహాన్ని రైతులు మరోసారి మననం చేసుకున్నారు. 2019–24 మధ్య హంద్రీ–నీవా ప్రస్తుత సామర్థ్యం కంటే అధికంగా జలాలను విడుదల చేసి తమకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసిందని రైతులు గుర్తు చేసుకున్నారు.
తాగునీటి పథకంగా మార్చేసిన ఘనుడు
హంద్రీ–నీవాకు 1983లో నాటి సీఎం ఎన్టీఆర్ శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువులో శంకుస్థాపన చేశారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారు. కానీ.. తట్టెడు మట్టి ఎత్తలేదు. 1999 ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద హంద్రీ–నీవా సుజల స్రవంతిని 5 టీఎంసీలకు కుదించి, సాగునీటి పథకాన్ని కాస్తా తాగునీటి పథకంగా మార్చి మరో సారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
2004 వర కూ అధికారంలో ఉన్న చంద్రబాబు తట్టెడు మట్టి కూడా వేయలేదు. 1995 నుంచి 2004 వరకూ ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది. రూ.13.75 కోట్లే. అదీ కార్యాలయాల నిర్వహణ, రెండుసార్లు శంకుస్థాపన, సభల నిర్వహణకు జనసమీకరణ కోసం చేసిన వ్యయమే కావడం గమనార్హం. చంద్రబాబు తీరును నిరసిస్తూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా శిలాఫలకాల వద్ద మొక్కలు నాటారు.
జలయజ్ఞంలో భాగంగా శ్రీకారం
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా హంద్రీ–నీవాకు శ్రీకారం చుడుతూ 2005లో ఉరవకొండలో శంకుస్థాపన చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టీఎంసీలు తరలించి.. 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనుల చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు. తన హయాంలోనే రూ.6,948.20 కోట్లు వ్యయం చేసి తొలిదశను పూర్తి చేశారు.
రెండో దశలో 80 శాతం పూర్తి చేశారు. దాంతో 2012లో హంద్రీ–నీవా తొలి దశను అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తూ ఆ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించింది. శ్రీశైలంలో 795 అడుగుల నుంచే హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2007, ఆగస్టు 31న చేపట్టిన నాటి సీఎం వైఎస్ 2009 నాటికే 90 శాతం పనులు పూర్తి చేశారు.

ఆకాశమే హద్దుగా టీడీపీ దోపిడీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటువేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసింది. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగించి కమీషన్లు దండుకుంది. ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) నిబంధనలకు విరుద్ధంగా జీవో 22(ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లులు చెల్లించి ముడుపులు వసూలు చేసుకుంది. కానీ.. ఏనాడూ సామర్థ్యం మేరకు హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేసిన పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు.
సామర్థ్యాన్ని మించి నీటిని తరలించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హంద్రీ–నీవా ద్వారా సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు 2021 జూన్ 7న రూ.6,182.20 కోట్లతో పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీ–నీవా సామర్థ్యాన్ని మళ్లీ 3,850 క్యూసెక్కులకే కుదించింది.
తొలి దశ కాలువ విస్తరణ ముసుగులో రూ.695.53 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించి తూతూమంత్రంగా పనులు కానిచ్చేసి దోచేసింది. రెండో దశ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రూ.1,968.92 కోట్లతో చేపట్టి అత్యంత నాసిరకంగా పనులు చేసి భారీఎత్తున ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మల్యాల వేదికగా చంద్రబాబు నాటకానికి తెరతీశారని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
‘జీఓ–98’ ఉద్యోగాలివ్వటానికి గల్లాపెట్టె ఖాళీ
సాక్షి, నంద్యాల/జూపాడు బంగ్లా : జీఓ–98 ప్రకారం శ్రీశైలం నీటిముంపు నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని గతంలో తనను కోరారని.. అవన్నీ చేయాలని ఉన్నప్పటికీ తనవద్ద గల్లాపెట్టె ఖాళీగా ఉందని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. మల్యాల సభలో ఆయన మాట్లాడుతూ.. నీటిముంపు నిర్వాసితుల ఆశలు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ కాస్త సమయం కావాలంటూ 674 మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.
నిజానికి.. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 29న నందికొట్కూరుకు వచ్చిన చంద్రబాబు తనకు అధికారమిస్తే శ్రీశైలం నీటిముంపు నిర్వాసితులకు జీఓ–98 ప్రకారం ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చారు. న్యాయం చేయలేనప్పుడు ఎన్నికల సమయంలో హామీలివ్వకూడదని బాధితులు మండిపడ్డారు. సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.