ప్రైవేటు పరం చేసే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు
ఇప్పటికే విద్యుత్ బస్సులు, కొన్ని డిపోలు ప్రైవేటు కంపెనీల చేతికి..
తాజాగా డ్రైవర్లు, కండక్టర్లూ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలకు నిర్ణయం
రెగ్యులర్ పోస్టులకు మంగళం పాడేసి ఆన్‌కాల్ విధానంలోకి..
అంటే పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో రోజువారీ కూలీలన్నమాట..
ఆర్టీసీలో 4వేల డ్రైవర్ పోస్టులు, 2వేల కండక్టర్ పోస్టులు ఖాళీ
ఇతర ఖాళీలనూ కలుపుకుంటే 15 వేలకు పైమాటే
ఆ పోస్టులేవీ భర్తీ చేయకుండా ఆర్టీసీని దెబ్బతీసే కుట్ర
ప్రైవేటు డ్రైవర్లతో భద్రతకు ముప్పు అంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ
ప్రైవేటీకరణ చర్యలు ఆపకుంటే ఉద్యమిస్తామంటూ హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేన్నైనా ప్రైవేటుపరం చేయడమంటే ఆయనకు ఇష్టం. ప్రైవేటు కంపెనీలంటే మహా ఇష్టం. ఎందుకంటే అందులోనే అస్మదీయులుంటారు.. అడిగిందల్లా అప్పనంగా ఇచ్చేయవచ్చు. అడిగినంత దోచిపెట్టవచ్చు. ప్రభుత్వరంగంలో వ్యవస్థలను నడపాలన్నా, నియామకాలు జరపాలన్నా ఆయనకు మహా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ‘మనసులో మాట’ పుస్తకంలో కూడా రాసుకున్నారు. ఆయనెవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా..ఆయనే సీఎం చంద్రబాబు.
గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను, పోర్టులను ప్రైవేటీకరిస్తూ ప్రజాధనాన్ని దారుణంగా లూటీ చేస్తున్న చంద్రబాబు ఇపుడు ఆర్టీసీ ప్రైవేటీకరణకు నడుం బిగించారు. ఆ మధ్య విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయించిన చంద్రబాబు కార్మికుల ఉద్యమంతో తోకముడిచిన సంగతి తెల్సిందే. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. విద్యుత్ బస్సులను, పలు డిపోలను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తొలి విడతగా నాలుగు డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేశారు. వాటిపై కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇపుడు డ్రైవర్, కండక్టర్ పోస్టులను సైతం ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పగించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ నియామకాలకు తిలోదకాలిచ్చేసి ఔట్‌సోర్సింగ్, ఆన్‌కాల్ విధానంలో సిబ్బందిని తీసుకుని ఆర్టీసీని నడిపించాలని చూస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంటే శాశ్వత ప్రాతిపదికన కండక్టర్, డ్రైవర్ వంటి పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆన్‌కాల్ అంటే.. రోజు కూలీ...
ఆర్టీసీలో సుమారు 4వేల డ్రైవర్ పోస్టులు, 2వేలకుపైగా కండక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఆన్‌కాల్ (ఏ రోజుకు ఆరోజు ఔట్‌సోర్సింగ్ విధులు) పద్ధతిలో పనిచేయించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి వేతనం ఇస్తారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీలో 1,800మంది ఆన్‌కాల్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. మరో 4వేల మందిని అదే పద్ధతిలో తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం.
ప్రజా రవాణాను దారుణంగా దెబ్బతీసే కుట్ర
ఎర్రబస్సు అంటే పేదవాడి బెంజ్ కారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణానికి ప్రధాన సాధనం. అలాంటి ప్రజా రవాణా వ్యవస్థను ఒక పథకం ప్రకారం దారుణంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. ఆర్టీసీ డిపోలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం వంటివన్నీ ఈకోవలోనివే. ఇపుడు డ్రైవర్లను, కండక్టర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించడం మరింత ప్రమాదకరమని ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులు అంటున్నారు.
ఆర్టీసీలో డ్రైవర్లను ‘‘ఆన్‌కాల్/రోజువారీ వేతనం’’పై తీసుకోవడం కేవలం ఉద్యోగుల సమస్యగా కాకుండా ప్రయాణికుల భద్రత, బాధ్యత, సిబ్బంది నిర్వహణ పరంగా కూడా సమస్యలు వస్తాయి. రెగ్యులర్ డ్రైవర్ నియామకంలో ఎంపిక, శిక్షణ, డ్రైవింగ్ పరీక్షలు, వైద్య పరీక్షలు, సేవా రికార్డు వంటి వ్యవస్థలు ఉంటాయి. రోజువారీ/ఆన్‌కాల్ విధానంలో అవి పట్టించుకోరు. ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ బస్సును నడిపే వ్యక్తి ఎంపికలో ప్రమాణాలు సడలితే ప్రమాదమే. ఆన్ కాల్ విధానం నేరుగా ప్రయాణికుల భద్రతపై పడుతుంది. ఆన్‌కాల్ డ్రైవర్ ఎక్కువ రోజువారీ ఆదాయం కోసం ఇతర డ్రైవింగ్ పనులు కూడా చేస్తే, అతని మొత్తం పని గంటలను ఆర్టీసీ ఎలా పర్యవేక్షిస్తుంది? అన్నది ముఖ్యమైన భద్రతా ప్రశ్న.
ఉద్యోగ భద్రత లేకపోవడంతో డ్యూటీ ఒత్తిడి రోజువారీ వేతనంపై ఆధారపడే డ్రైవర్‌కు ‘‘డ్యూటీ వద్దంటే తదుపరి రోజు పని ఉండకపోవచ్చు’’ అనే పరిస్థితి ఉంటే, టైమ్ టార్గెట్లు, ట్రిప్పులు, అదనపు డ్యూటీల విషయంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రజా రవాణాలో భద్రత కంటే ట్రిప్పుల సంఖ్య/సమయపాలనకు ప్రాధాన్యత పెరగకూడదనే అంశాన్ని ముందుకు తెస్తుంది. రూట్ పరిజ్ఞానం, డిపో విధానాలపై అవగాహన, బస్సు ప్రత్యేకతలపై పరిచయం, స్థానిక ట్రాఫిక్ పరిస్థితుల అవగాహన, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో రెగ్యులర్ డ్రైవర్లకు ఉన్న అవగాహన రోజువారీ వేతన డ్రైవర్ కి వుండవు.
విద్యుత్ బస్సులది ‘ప్రైవేట్ దారి’..
కేంద్ర ప్రభుత్వ సాయంతో పీఎం ఈ బస్సు సేవా పథకంలో ఏపీఎస్ ఆర్టీసీలో తెస్తున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించేలా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,450 విద్యుత్ బస్సుల ఆపరేషన్, నిర్వహణను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని నిర్ణయించారు.
వాటిలో తొలివిడతగా 750 విద్యుత్ బస్సులను పూనేకు చెందిన పినాకిల్ అనే కంపెనీకి అప్పగించి వాటి నిర్వహణకు అవసరమైన 12 డిపోలలో నాలుగింటిని (విద్యాధరపురం, గుంటూరు 2, మంగళం, నెల్లూరు 2) సైతం ఆ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు దశలవారీగా ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ బస్సుల్లో ఒక్కటీ ఇంకా రోడ్డెక్కలేదు. ఆ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రయాణీకులు పెరిగారు.. బస్సులు తగ్గాయి..
రాష్ట్రంలో గతేడాదితో పోల్చితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు పెరిగారు. అందుకు అనుగుణంగా బస్సులు, సిబ్బంది సంఖ్య పెరగకపోగా మరింత తగ్గిపోయింది.
» 2025 ఆగష్టు నాటికి రాష్ట్రంలో 10,700 బస్సులు తిరిగేవి. 44వేల సిబ్బంది ఉండేవారు. ప్రతిరోజూ 35 లక్షల మందికిపైగా ప్రయాణించేవారు.
» 2026 ఆగష్టు నాటికి కాలం చెల్లిన 600 బస్సులు తగ్గిపోగా 10,100 బస్సులు మాత్రమే సర్వీస్ చేస్తున్నాయి. గోదావరి పుష్కరాలు(2027)నాటికి మరో 1500 బస్సులకు కాలం చెల్లిపోతుంది(్రస్కాప్ అవుతాయి). గడిచిన ఏడాదికాలంలో దాదాపు మూడు వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేయడంతో 41వేల మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణీకులు మాత్రం దాదాపు 15లక్షలు పెరిగి మొత్తం 50లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
» వాస్తవానికి 35 లక్షల మంది ప్రయాణీకులకు 44వేల సిబ్బంది, 10,700బస్సులు ఉంటే పెరిగిన మరో 15లక్షల మందికి అదనంగా కనీసం 20వేల సిబ్బంది, ఐదు వేల బస్సులు అవసరం.
» వైఎస్ జగన్ ప్రభుత్వంలో తిరుమల కొండపై తెచ్చిన ఈ బస్సులు, ఏపీఎస్ ఆర్టీసీకి మంజూరు చేసిన డీజిల్ బస్సులు మినహా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క బస్సు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన బస్సులే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్తగా వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నాన్ ఏసీ సీఎన్‌జీ 500 బస్సులకు టెండర్ పిలిచారు. దాన్ని రద్దు చేసి వాటిని ఏసీ బస్సులుగా మళ్లీ టెండర్ పిలవాలని నిర్ణయించారు.
ఆర్టీసీ విలీనం.. దశాబ్దాల కల నెరవేర్చిన జగన్
దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ఆర్టీసీ విలీనాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. తద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు. అంటే ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారన్నమాట. వారంతా కొత్తగా ఏర్పాటైన ప్రజా రవాణా శాఖ కిందకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమనిబంధనలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచారు. ఈ విలీనం వల్ల ప్రభుత్వంపై రూ.3,300 కోట్ల ఆర్టీసీ ఆర్థిక భారం పడింది. అయినా వైఎస్ జగన్ వెనక్కి తగ్గలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
4వేల బస్సులు.. 15వేల రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలి
ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్
ఏపీఎస్ ఆర్టీసీలో ప్రభుత్వమే సొంతంగా 4వేల బస్సులను కొనుగోలు చేసి 15వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఏపిపిటిడి(ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు స్టేట్ కో కన్వీనర్లు పీవీ రమణారెడ్ఢి, జీవీ నరసయ్య, సీహెచ్ సుందరయ్య, కట్టా సుబ్రమణ్యం, ఎస్‌వీ శేషగిరిరావు, సూర్యప్రకాశరావు, జి.మాల్యాద్రి డిమాండ్ చేసారు. కండక్టర్ల కొరతను అధిగమించే పేరుతో రెగ్యులర్ నియామకాలకు బదులుగా కాంట్రాక్టర్ ద్వారా ఔట్‌సోర్సింగ్, ఆన్‌కాల్ పద్దతిలో నియమించడం సరికాదన్నారు.
ఈ విధానం తాత్కాలికంగా సిబ్బంది కొరతను తీర్చినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగ వ్యవస్థను బలహీనపరిచి, ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది సహా వివిధ కేటగిరీల్లో సుమారు 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ జరగకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే పునరాలోచించి రెగ్యులర్ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు విడనాడకపోతే సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత కోసం అన్ని సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.


