
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు
మహానాడులో అధికారికంగా ప్రకటించే అవకాశం
పార్టీ పొలిట్‌బ్యూరో, ఇతర కమిటీల్లో సీనియర్లకు చెక్
తన అనుయాయులతో నింపేందుకు లోకేశ్ స్కెచ్
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో అపరిమిత అధికారాలు చెలాయిస్తున్న తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కి మరింత ప్రాధాన్యత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా అన్ని వ్యవహారాల్లో ఆయన మాటే శాసనంగా నడుస్తున్నా, అధికారికంగా సీఎం, డిప్యూటీ సీఎం తర్వాతే ఉన్నారు. దీంతో తనకు మరింత ప్రాధాన్యత కల్పించాలని లోకేశ్ చాలారోజుల నుంచి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అభీష్టానికి అనుగుణంగానే కొందరు టీడీపీ నేతలు లోకేశ్‌ను సీఎం చేయాలని, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, మరికొందరు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడులో ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రకరకాల డిమాండ్‌లు.. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి?
కొద్ది నెలల క్రితం లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదన పార్టీలో గట్టిగా వినిపించింది. ఆ సమయంలోనే దావోస్ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ లోకేశ్ తమ భావి ముఖ్యమంత్రి అని ప్రకటించి విమర్శలపాలయ్యారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో లోకేశ్‌కి ఏడాదిలోనే కొత్త పదవి ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన కోరిక నెరవేరలేదని తెలుస్తోంది. కానీ పార్టీ పదవి అనేది ఆ పార్టీ సొంత వ్యవహారం కాబట్టి అందులోనే కీలక పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తద్వారా తన తర్వాత తన కుమారుడే అని అధికారికంగా చెప్పినట్లవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి జరిగే మహానాడులో లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడానికి
రంగం సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా ఆయన ప్రాధాన్యత మరింత పెరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ కమిటీల్లోనూ భారీ మార్పులు.. సీనియర్లకు చెక్
ఈ మహానాడులో పార్టీ పొలిట్‌బ్యూరో, అన్ని కమిటీల్లో భారీ మార్పులు చేయనున్నారు. చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండే వారిని ఈ కమిటీల్లోకి తీసుకునేందుకు లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 25 మంది ఉండగా, వారిలో చాలామంది పాతవారే. యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నక్కా ఆనంద్‌బాబు, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ వంటి సీనియర్లు ఉన్నారు.
వారిలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నా ఏమాత్రం ప్రాధాన్యత లభించడంలేదు. యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు. కాకినాడ సెజ్ వ్యవహారంలో ఆయన చంద్రబాబుకు లేఖ రాయడంతో పార్టీ శ్రేణులతో ఆయన్ను తీవ్ర స్థాయిలో అవమానించేలా ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారు. అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్, గోరంట్ల, సోమిరెడ్డి, కళా, చినరాజప్ప వంటి వారికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా కష్టంగా మారింది.
వీరందరినీ పొలిట్‌బ్యూరో నుంచి తప్పించి కొత్త వారిని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ కమిటీల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తామని లోకేశ్ పదేపదే చెబుతున్నారు. ఇందుకోసమే ఇటీవల వరుసగా మూడుసార్లు పార్టీ పదవిలో ఉన్నవారిని ఆ పదవుల్లో కొనసాగించకూడదని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేయించారు. దీంతో సీనియర్లకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ కోసం అహరి్నశలూ కష్టపడితే లోకేశ్ కోసం చంద్రబాబు తమను అవమానిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.