బీచ్‌లలో బీరు.. బారు | Chandrababu Govt Permits Establishment of Mini Bars in Visakhapatnam | Sakshi
Sakshi News home page

బీచ్‌లలో బీరు.. బారు

Jun 5 2026 3:57 AM | Updated on Jun 5 2026 3:57 AM

Chandrababu Govt Permits Establishment of Mini Bars in Visakhapatnam

‘బీచ్‌ షాక్స్‌’కు మంత్రిమండలి ఓకే 

తీరంలో పోటెత్తనున్న మద్యం ప్రవాహం.. పర్యాటకానికి ప్రోత్సాహం ముసుగులో బాబు సర్కారు నిర్వాకం 

విశాఖ, సూర్యలంకలో మినీ బార్ల ఏర్పాటుకు అనుమతి 

అనంతరం అన్ని బీచ్‌లలోనూ ఏర్పాటు 

బీచ్‌లు ఇక అసాంఘిక శక్తుల అడ్డాలు

చంద్రబాబు సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత

ఇన్నాళ్లూ.. బీచ్‌ అంటే షికార్లు.. సరదాలు.. 
పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! 
ఇకపై.. బీచ్‌లంటే బీరు, బారు.. 
మందూ, చిందూ.. ఆకతాయిలు, 
అసాంఘిక శక్తుల కోలాహలం!! 

రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్‌లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్‌ షాక్స్‌’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్‌ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  

బీచ్‌ షాక్స్‌ అంటే.. మినీ బార్లే 
బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్‌ షాక్స్‌ ఏమిటంటే... బీచ్‌లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో బీచ్‌ షాక్స్‌ ఏర్పాటుకు అనుమతినిచ్చింది.  ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌ షాక్స్‌ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్‌లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది.  

టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి పచ్చజెండా 
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్‌ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్‌ రూమ్‌లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది.

కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్‌ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది.  

తీరప్రాంతం ధారాదత్తం.. 
అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్‌ షాక్స్‌ పేరుతో బీచ్‌లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో పైలట్‌ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్‌లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్‌లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్‌కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.

ఇక బీచ్‌కు వెళ్లాలంటే భయం భయం..!
చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్‌లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్‌లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.

ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్‌కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్‌లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్‌లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్‌లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్‌లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్‌లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

బికినీ ఫెస్టివల్‌ నుంచి బీచ్‌ షాక్స్‌ దాకా.. 
2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్‌ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్‌లలో బికినీ ఫెస్టివల్‌ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్‌లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. 

– సాక్షి, అమరావతి

Advertisement
 
Advertisement
Advertisement