2020లో శాశ్వత భూ హక్కు, భూ రక్షను ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
భూముల రీ సర్వే చేసిందెవరు? క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుందెవరు?
రీ సర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నాడు దుష్ప్రచారం చేసిందే చంద్రబాబు
అప్పుడు సర్వేను అడ్డుకుని ఇప్పుడు అదే సర్వే క్రెడిట్ కొట్టేసే యత్నం
జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం రూ.400 కోట్లు ఇస్తే అవి తనవల్లే వచ్చాయని చంద్రబాబు ప్రచారం..
దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉండదంటున్న రెవెన్యూ రంగ నిపుణులు
రీ సర్వేకు అంకురార్పణ చేసి విజయవంతంగా నిర్వహించింది జగన్ ప్రభుత్వం
సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారి 15 వేల మంది సర్వేయర్ల నియామకం
అత్యాధునిక టెక్నాలజీతో తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాల వినియోగం
భూములకు జియో హద్దులు.. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌లు
వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సర్వేను రోల్ మోడల్‌గా తీసుకున్న కేంద్రం
దీంతో అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకున్న బాబు
రీ సర్వే క్రెడిట్ చోరీ చేస్తూ అది తనదిగా చెప్పుకునే ప్రయత్నం
సర్వే రాళ్లపై నవరత్నాల లోగో వేస్తే రాజకీయ లబ్ధి కోసం నాడు బాబు దుష్ప్రచారం
సీఎంవో నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అన్ని చోట్లా ఈ లోగోతో ఫొటో
దాన్నే సర్వే రాళ్లపై వాటర్ మార్క్‌గా ముద్రిస్తే తప్పంటూ విష ప్రచారం
సర్వే చేయక ముందు, చేసిన తర్వాత పరిస్థితి తెలిసేందుకే ఫొటో ముద్రణ
ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్లపై చంద్రబాబు ఫొటో ఉండటం లేదా?
సాక్షి, అమరావతి: తనకు సంబంధం లేని వాటిని కూడా తానే చేసినట్లు నిర్భీతిగా, నిస్సిగ్గుగా చెప్పుకునే చంద్రబాబు.. జగన్ హయాంలో ప్రారంభమైన భూముల రీ సర్వే క్రెడిట్‌ను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రీ సర్వేపై అదే పనిగా దుష్ప్రచారం చేసి, దానివల్ల రైతుల భూములు కబ్జా అవుతాయని చెప్పిన నోటితోనే ఇప్పుడు దాన్ని తానే ప్రారంభించినట్లు చెప్పుకుంటూ బహిరంగంగా మరో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. లక్షల ఎకరాలను 22–ఎ జాబితాలో పెట్టిన బాబు.. ఇప్పుడు వేల ఎకరాలను 22–ఎ జాబితా నుంచి తొలగించినట్లు బరితెగించి ప్రచారం చేసుకోవడం గమనార్హం.
బ్రిటీషర్ల తర్వాత ఏ రాష్ట్రంలో, ఏ పాలకుడూ తలపెట్టని అతి పెద్ద భూముల సర్వేను గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంత మంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా, సుమారు 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికిపైగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దులో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చి వేసే దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు, అభాండాలు వేశారు.
సర్వే రాళ్లపై ముద్రించిన లోగోపై తప్పుడు ప్రచారం
సర్వే చేసి, హద్దులు నిర్ణయించి, ఆ హద్దులో ప్రభుత్వమే రాళ్లు పాతి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తే దానిపై ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేశారు. ఆ రాళ్లపై జగన్ ఫొటో ఉందని చంద్రబాబు బురదజల్లారు. నిజానికి ఆ రాళ్ల మీద ఉన్న ఫొటో నవరత్నాల వాటర్ మార్క్ లోగో. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉన్నాయి. ఆ నవరత్నాల ఫొటోను 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా భావించారు. అధికారంలోకి వచ్చాక సీఎం కార్యాలయం నుంచి ప్రతి పంచాయతీ కార్యాలయంలోనూ ఆ ఫొటో పెట్టి దాని ప్రకారం పరిపాలన నడిపిన చరిత్ర జగన్‌ది. అయితే మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫొటోపైనే చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. నవరత్నాల కేంద్రంగానే మొత్తం పరిపాలన సాగించి, ఇచ్చిన ప్రతిని హామీని అమలు చేసి చూపిస్తే దాన్ని తప్పు పట్టిన వ్యక్తి చంద్రబాబు.
అప్పుడు అడ్డుకుని.. ఇప్పుడు తనదేనని..
రీ సర్వేను అడ్డుకుని, దానిపై దుష్ప్రచారం చేసి, మీ భూములు పోతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా దాన్ని తన ఖాతాలో వేసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను తెచ్చిన సంస్కరణల వల్లే రీ సర్వే జరుగుతోందని, దానికి రూ.400 కోట్లు కేంద్రం ఇచ్చిందని ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. వివాదాలు లేని భూముల వ్యవస్థను తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ రీ సర్వేకు అంకురార్పణ చేసి నిర్వహించారు. సర్వే పూర్తి చేసే క్రమంలో 14 లక్షల పట్టా సబ్ డివిజన్లు, దాదాపు 10 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 3 లక్షలకు పైగా రైతుల పేర్లు తొలిసారి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం వెళితే పట్టే సమయం, ఏర్పడే తిప్పలు ఎన్నో తెలిసిందే. రీ సర్వే ద్వారా రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఈ పనుల్ని జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.
జగన్ హయాంలోనే క్యూఆర్ కోడ్.. జియో హద్దులు
క్యూ ఆర్ కోడ్ ముద్రించడం ఒక్కటే కాదు.. సర్వే పూర్తయిన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం అక్షాంశాలు, రేఖాంశాలుతో గత జగన్ ప్రభుత్వం జారీ చేసింది. అంటే శాటిలైట్ హద్దులన్నమాట. వాటిని మార్చడం సాధ్యం కాదు. క్షేత్ర స్థాయిలో భూమి హద్దులు మారినా శాటిలైట్ హద్దులు మాత్రం అలాగే ఉంటాయి. పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూ ఆర్ కోడ్, జియో హద్దులు ఇవ్వడం జగన్ హయాంలో వచ్చిన అతి పెద్ద భూ సంస్కరణల్లో ఒకటి. అసలు ఇవేమీ వద్దని.. వాటి ద్వారా రైతుల నుంచి భూములు లాక్కుంటారని అడ్డగోలు దుష్ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా అవన్నీ తాను తెచ్చినవేనని డప్పు కొట్టుకోవడం చూసి రెవెన్యూ యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. 
జగన్ చేసిందాన్నే మళ్లీ చేస్తూ తనదిగా ప్రచారం
రీ సర్వేలో ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ కూడా ఇచ్చారు. వాటన్నింటితో కలిపి ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజకీయ ముద్ర వేసి అధికారంలోకి వచ్చాక బాబు ఏకపక్షంగా రద్దు చేశారు. ఏడాదిన్నర తర్వాత తప్పుల తడకలుగా కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించి గతంలో జగన్ హయాంలో ఇచ్చిన క్యూఆర్ కోడ్, జియో కోఆర్డినేట్స్‌నే అందులో పెట్టి అవి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి రీ సర్వే తర్వాత జగన్ ప్రభుత్వం ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ మాదిరిగా ఒక విశిష్ట సంఖ్య (ఐడీ నంబర్) కూడా ఇచ్చింది.
వీటన్నింటి వల్ల రికార్డుల ఆధునికీకరణ జరిగి వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేని వ్యవస్థ సృష్టించి భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించేందుకు, భూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ తెచ్చిన ఈ విధానంపై చంద్రబాబు జగమంత విషం కక్కారు. కానీ ఇప్పుడు తాను గతంలో చేసిన దుష్ప్రచారాన్ని మరచిపోయి అది ఘనతేనని చెప్పుకుంటున్నారు. దీన్ని చూసి ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదని రెవిన్యూ విభాగం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
డ్రోన్లు.. విమానాలు.. ఆధునిక టెక్నాలజీతో రీ సర్వే
రీ సర్వే కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యాధునిక సర్వే టెక్నాలజీని వినియోగించింది. 2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో సర్వే ప్రారంభించింది. అప్పటి నుంచి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (సీఓఆర్‌ఎస్), జీఎన్‌ఎస్‌ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వం (తేడా)తో రైతులు సంతృప్తి చెందేలా సర్వే చేశారు. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని డ్రోన్ల ద్వారా సర్వే (కొలిచారు) చేశారు.
భూ హక్కు పత్రాల ద్వారా యజమానులకు రికార్డుల్లో యాజమాన్య హక్కులు కల్పించడం, వారి భూముల హద్దుల్లో భూరక్ష సర్వే రాళ్లు పాతడం ద్వారా రక్షణ కల్పించడమే లక్ష్యంగా రీ సర్వే నిర్వహించారు. అభ్యంతరాలు, వినతులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు మండలానికి ఇద్దరు చొప్పున 1,358 మంది మొబైల్ మేజిస్ట్రేట్‌లను నియమించి 40 వేల వివాదాలను పరిష్కరించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇక్కడ జరుగుతున్న రీ సర్వే మోడల్‌పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. కేంద్ర ప్రభుత్వం ఏపీలో జరుగుతున్న రీ సర్వే అద్భుతమని కితాబిచ్చింది.
సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. నిలిపివేసిన చంద్రబాబు
నాటి ప్రభుత్వంలో సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే క్రమంలో దాన్ని నిలిపివేశారు.
ఎన్నికలప్పుడేమో ఇలా విషప్రచారం..
సర్వే రాళ్లపై ఆ ఫొటో ఎందుకంటే..
రీ సర్వే చేయక ముందు, చేసిన తర్వాత ఉన్న తేడా స్పష్టంగా తెలియడం కోసమే రాళ్లపై ఆ నవరత్నాల లోగోను ముద్రించారు. కేవలం సరిహద్దులు నిర్ణయించి వదిలేస్తే మళ్లీ గొడవలు వస్తాయని, ఎవరికి వారు రాళ్లు పాతుకోవాలంటే కష్టమవుతుందని, ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వమే రాళ్లు పాతించింది. ఆ రాళ్లపై నవరత్నాల లోగో ముద్రిస్తే అందులో జగన్ ఫొటో ఉందని తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఫొటో ఉండడం వల్లæ తప్పేంటి? ఇప్పుడు పింఛన్ల ఫొటోల్లో చంద్రబాబు ఫొటో ఉండడం లేదా? అయిన దాంట్లో, కాని దాంట్లో తన పాంప్లెట్లపై పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్న చంద్రబాబు.. చరిత్రలో తొలిసారి సాహసోపేతంగా రీ సర్వే చేసి, హద్దు రాళ్లపై లోగోను ముద్రించడం తప్పెలా అవుతుందో చంద్రబాబుకే తెలియాలి.
రీ సర్వేలో ఏపీ నంబర్ వన్ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబు
ఇటీవల టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూముల సర్వేలో ఏపీ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేదు. సర్వే చేయకుండానే రాష్ట్రం ఎలా నంబర్ వన్‌గా నిలిచింది? జగన్ హయాంలో ఒక యజ్ఞంలా జరిగిన రీ సర్వే వల్లే ఏపీ అందులో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది. రోల్ మోడల్‌గా నిలిచిన కార్యక్రమంపై అడ్డగోలుగా అభాండాలు వేసిన చంద్రబాబు ఇప్పుడు రంగు మార్చి అది తన గొప్పేనని చెప్పుకోవడాన్ని ఏమనాలి?


