అర్హతల్లో అయోమయం! | Chandrababu Government Conspiracy in Filling University Posts | Sakshi
Sakshi News home page

అర్హతల్లో అయోమయం!

May 24 2026 6:14 AM | Updated on May 24 2026 6:14 AM

Chandrababu Government Conspiracy in Filling University Posts

విశ్వవిద్యాలయాల పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర 

సబ్జెక్టుల వారీగా అర్హతలు నిర్ణయించకుండా డిపార్ట్‌మెంట్‌ మొత్తానికీ ఒక్కటే అర్హత!

కడప వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ వర్సిటీలో వింత పరిస్థితి 

ఆర్జీయూకేటీలో పోస్టుల భర్తీలో భారీగా కోత 

ట్రిపుల్‌ ఐటీల్లో కావాలనే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వని వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల నియామక నోటిఫికేషన్లు మూడు తప్పులు, ఆరు సవరణల చందంగా మారిపోయింది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించకుండా తయారు చేసిన నోటిఫికేషన్‌లను దరఖాస్తులు ప్రారంభమయ్యే సమయం వరకు సవరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయాలైన వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్, రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక వర్సిటీ(ఆర్జీయూకేటీ)ల్లో సరైన ప్రక్రియ లేకుండా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ తర్వాత అర్హతలను సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా వర్సిటీల్లో ఒక్కో విభాగానికి ఒక్కో నిష్పత్తి ప్రకారం ఇష్టారీతిన పోస్టులు కేటాయించడంతో రిజర్వేషన్‌ రోస్టర్‌ సైతం మారిపోతుండటం గమనార్హం.  

గంపగుత్తగా ఒక్కటే అర్హతా? 
వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ చిత్రవిచిత్రంగా కనిపిస్తోంది. ఇక్కడ సబ్జెక్టుల వారీగా కాకుండా విభాగాల వారీగా గంపగుత్తగా పోస్టులు ప్రదర్శించడం కొసమెరుపు. ఉదాహరణకు గత 2023లో నోటిఫికేషన్‌లో వర్సిటీలోని బిల్డింగ్‌ టెక్నాలజీ విభాగంలో సివిల్, ఈఈఈ, ఫెసిలిటీస్‌ అండ్‌ సర్వీసు ప్లానింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కింద ఏడు పోస్టులకు విడివిడి అర్హతలతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌లో బిల్డింగ్‌ టెక్నాలజీలో 5 పోస్టులను కుదించి, వాటిని ఏ విభాగానికి చెందినవో స్పష్టం చేయలేదు.

పైగా బిల్డింగ్‌ టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌ అర్హతలను మాత్రమే సూచించడం గమనార్హం. అంటే, కేవలం ఆ విభాగాన్ని సివిల్‌ ఇంజినీరింగ్‌ అర్హత కలిగిన వారితో భర్తీ చేసేందుకు వీసీ కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. యానిమేషన్, అప్లైడ్‌ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, డిజైన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైన్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, ప్లానింగ్, స్కల్ప్‌చర్‌లోనూ ఇదే తంతు. వాస్తవానికి విడివిడి అర్హతలతో పోస్టులకు దరఖాస్తులను పిలిస్తే పరిశీలన కష్టం అవడంతో పాటు పోస్టుల భర్తీ కాకుండా ఉండిపోతే ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఆగిపోతాయనే ఉద్దేశంతోనే ఒకే అర్హతతో గంపగుత్తగా పోస్టులు భర్తీ చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది.  

పరిశ్రమ అనుభవం పీహెచ్‌డీతో సమానమా? 
ఫార్మసీ విభాగంలో అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అర్హతలను సైతం నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత సవరించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి పీహెచ్‌డీ లేకున్నా 8ఏళ్లు పరిశ్రమ అనుభవం, ప్రథమ శ్రేణిలో మాస్టర్స్‌ డిగ్రీ ఉంటే చాలని, దీనిని ప్రత్యేక కమిటీ ధ్రువీకరిస్తే పీహెచ్‌డీతో సమానంగా పరిగణిస్తామని పేర్కొనడం గమనార్హం. పైగా గతంలో ఎక్కువ స్పెషలైజేషన్లకు అవకాశం కలి్పస్తే ఇప్పుడు కేవలం ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ మాత్రమే పేర్కొన్నారు.

ఇక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు ప్రథమ శ్రేణిలో బీ–ఫార్మసీ, మాస్టర్స్‌ అర్హతను కాస్త.. కేవలం బేసిక్‌ బీ–ఫార్మా డిగ్రీకి పరిమితం చేసింది. మాస్టర్‌ డిగ్రీలో ప్రథమ శ్రేణి ఉండాలని పెట్టింది. ప్రైవేటు సంస్థల్లో బోధన, పరిశోధన, వృత్తిపర అనుభవాన్ని, జర్నల్స్‌లో పరిశోధన పత్రాలను అదనపు అనుభవంగా కోరుతోంది. అంటే, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న తమ అనుకూల వ్యక్తులకు మేలు చేకూర్చేందుకు ఇలాంటి ఎత్తుగడ వేసినట్టు భోగట్టా. 

ఆర్జీయూకేటీలో అరకొర పోస్టులేల! 
ఆర్జీయూకేటీలో గతంలో 611 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తే ఇప్పుడు 311 పోస్టులకు పరిమితం చేసింది. 2017, 2018 నోటిఫికేషన్లపై సుప్రీం కోర్టులో కేసులు ఉండటంతో ఆ పోస్టులను మినహాయించి కొత్తగా వర్సిటీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చినట్టు ప్రచారం చేస్తోంది. కానీ, ఆ రెండు నోటిఫికేషన్లలో ఆర్జీయూకేటీ ఎప్పుడూ పాల్గొనలేదు. కేవలం 2023లో అన్ని వర్సిటీలతో పాటు నోటిఫికేషన్‌లోకి వచ్చింది. 2013లో పాక్షికంగా చేపట్టిన 53 శాశ్వత పోస్టుల తర్వాత ఇప్పటి వరకు కొత్త నియామకాలు చేయలేదు.

అలాంటిది ఈసారి పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కేవలం 104 అసిస్టెంట్, 104 లెక్చరర్‌ పోస్టులకు రెగ్యులర్, 103 పోస్టులను బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం గమనార్హం. ఆర్జీయూకేటీలో రెగ్యులర్‌ పోస్టులకు విభాగాల వారీగా నోటిఫికేషన్‌ ఇస్తే బ్యాక్‌లాగ్‌లో మాత్రం రెండు, మూడు సబ్జెక్టులను కలిపి గ్రూప్‌గా విభజించడంతో రోస్టర్‌ గాడితప్పినట్టేనని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ నోటిఫికేషన్‌లోనూ 104 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉంటే వాటిల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో 31, ఈఈఈలో 23 పోస్టుల మినహా మిగిలిన 11 విభాగాల్లో వేళ్లపై లెక్కపెట్టే పోస్టులున్నాయి. ఆర్జీయూకేటీ వంటి రెసిడెన్షియల్‌ వర్సిటీలో విద్యార్థుల బలవన్మరణాలను అరికట్టేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సైకాలజీ విభాగాన్ని తీసుకొస్తే అందులో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయట్లేదు.

అప్పుడే బేరసారాలు!
ఆర్జీయూకేటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ఊసే లేకుండా పోయింది. ఇక్కడ, సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆర్జీయూకేటీ బోధకులు కుట్ర పన్ని రెగ్యులర్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ లేకుండా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నోటిఫికేషన్‌లో ఏకంగా 103 అసోసియేట్‌ ప్రొఫెసర్లకు నోటిఫికేషన్‌ ఇస్తే ఇప్పుడు కేవలం బ్యాక్‌లాగ్‌లో 37 పోస్టులు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ రెండింటిలోనూ ఒక్క ప్రొఫెసర్‌ పోస్టు లేకపోవడం గమనార్హం.

ఇక్కడ రిజిస్ట్రార్, సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో జరగాల్సిన పోస్టుల కేటాయింపు కేవలం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాలోని ఓ వ్యక్తి పరిపాలన విభాగంలో ఇన్‌చార్జి హోదాలో కొనసాగుతూ ఇష్టారీతిన పోస్టు కేటాయించినట్టు వినికిడి. పైగా ఇప్పటికే తమ అనుకూల వ్యక్తులకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమించేందుకు అభయం ఇస్తూ పోస్టులు ఎలాగైనా కట్టబెట్టేందుకు బేరసారాలు సాగిస్తున్నారు. పైగా ఇప్పుడే అసోసియేట్‌ పోస్టులు భర్తీ చేస్తే తమకు చాన్స్‌ ఉండదనే భయంతో వాటిని తొక్కిపెట్టి వర్సిటీలో కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం(సీఏఎస్‌) కింద అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పదోన్నతులు పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement