
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా తెలుగు సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రతాప్‌రెడ్డి 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.
బీటెక్ పూర్తిచేసి ఐపీఎస్ అయిన ప్రతాప్‌రెడ్డి మొదట హాసన్ జిల్లా అరసికెరె ఏఎస్పీగా, తరువాత పలు జిల్లాల ఎస్పీగా, కొంతకాలం బెంగళూరు – ముంబయి సీబీఐ విభాగంలో విధులు నిర్వర్తించారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలక పాత్ర పోషించారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి, సీఎం మెడళ్లను అందుకున్నారు. ఆయన మంగళవారం కొత్తబాధ్యతలు తీసుకుంటారు.
చదవండి: (ఆత్మహత్య వెనుక హనీట్రాప్)