
ప్రైవేటీకరణలో వెనక్కి తగ్గలేదని ఎప్పటికప్పుడు కేంద్రం స్పష్టికరణ.. కేంద్ర మంత్రులు, అధికారులదీ ఇదే మాట
దీనికి భిన్నంగా రాష్ట్రంలో కూటమి నేతల ప్రచారం
‘‘విశాఖ స్టీలులో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై 2021 జనవరిలో కేబినెట్ కమిటీ తీర్మానం చేసింది. దీనిని వెనక్కి తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన లేదు’’
⇒ వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో అడిగిన పలు ప్రశ్నలకు ఆగస్టు 1వ తేదీన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేసిన ప్రకటన
‘‘అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వహణ సాధ్యం కాకుండా ఉన్న విశాఖ స్టీలు ప్లాంటు మూతపడటానికి దగ్గరగా ఉంది. ఉద్యోగుల భారాన్ని తగ్గించేందుకే వీఆర్‌ఎస్ అమలు చేస్తున్నాం’
⇒ వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబురావు ఆగస్టు 8వ తేదీన అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సెప్టెంబరు 16న సభలో ఇచ్చిన సమాధానం
‘‘ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సంబంధించి ప్రైవేటీకరణపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటివరకూ ఎటువంటి మార్పు లేదు’’
⇒ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథ్‌రావు 2025 మార్చి 2వ తేదీన ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు మార్చి 18న కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) అండర్ సెక్రటరీ అజయ్ నాగ్‌పాల్ వివరణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనేక సందర్భాల్లో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదని... ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అయినప్పటికీ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు పవన్, లోకేశ్‌లు ప్రకటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు స్టీలు ప్లాంటు సిబ్బందిని మభ్యపెట్టేందుకు పదేపదే ప్రజలను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు.
వేతన బకాయిల సమస్యలో ఉద్యోగులు
స్టీలు ప్లాంటుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సమయంలో క్రెడిట్ తమదంటే తమదంటూ కూటమి నాయకులు గొప్పలు పోయారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్యాకేజీ మొత్తం రాకపోగా, ఇప్పటికీ స్టీలు ప్లాంటు కార్మికులు భారీ వేతన బకాయిలతో సతమతమవుతున్నారు. మరోవైపు ఉద్యోగులను తొలగించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) అమలు చేస్తున్నారు. మొదటి దఫాలో వీఆర్‌ఎస్ ద్వారా 1,120 మంది కార్మికులతో రాజీనామా చేయించారు. రెండో విడతలో 464 మందిని ఇంటికి సాగనంపారు. అంతేకాకుండా కాంట్రాక్టు కార్మికులు 5,000 మందిని ఇప్పటికే తొలగించారు.
కార్మిక సంఘాల ఆగ్రహం
అన్నింటికీ మించి విభాగాల వారీగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకుగానూ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే 32 విభాగాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయాన్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం ముందుకు తీసుకెళుతోంది. ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలు మాత్రం ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందంటూ ప్రకటనలు ఇవ్వడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముడిసరుకుల కొరతతో విశాఖ స్టీల్ ఉత్పత్తి పెరగని పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది.
సెయిల్‌లో విలీనం అవశ్యం...
స్టీల్ ప్లాంట్‌కు ప్రస్తుతం రోజుకు 6 ర్యాక్‌ల బొగ్గు అవసరం ఉంది. అయితే పూర్తిస్థాయి ఉత్పత్తికి 9 ర్యాక్‌లు కావాలి. నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేటు ప్లాంటు ప్రారంభమైతే మొత్తం 13–14 ర్యాక్‌ల బొగ్గు అవసరం ఏర్పడుతుంది. కానీ ఒక్క రైల్వే లైన్‌తో ఈ సరఫరా సాధ్యం కాదు. మిట్టల్ సంస్థలు తమ వనరులతో సమస్య పరిష్కరించుకోగలుగుతాయి. విశాఖ స్టీలుకు అది కష్టమే. ఉద్యోగుల సంఖ్యను 12 వేల నుంచి 7 వేలకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగా, ఈ సిబ్బందితో పూర్తి ఉత్పత్తి సాధ్యం కాదంటున్నారు. కాబట్టి బొగ్గు గనులు కలిగిన సెయిల్‌లో విలీనం చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని భావిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీది దీర్ఘకాలిక పోరాటం...!
విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచీ వైఎస్సార్‌సీపీ ఒకే నిర్ణయంపై ఉంది. కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తోంది. విశాఖ స్టీలు ప్లాంటును 100 శాతం ప్రైవేట్‌పరం చేసేందుకు అనుగుణంగా 2021 జనవరిలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 2021 ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు 2021 మేలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఎప్పటికప్పుడు పార్లమెంటులో కూడా తన గళాన్ని గట్టిగా వినిపిస్తోంది. పార్లమెంటు సభ్యులతో కలిసి కేంద్రానికి పలు దఫాలుగా విశాఖ స్టీలును ప్రైవేటీకరించవద్దంటూ వినతిపత్రాలను వైఎస్ జగన్ సమర్పించారు.
లక్షల మంది సాక్షిగా ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో 2022 నవంబరు 12న జరిగిన ప్రధాని మోడీ సభలో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించవద్దంటూ స్వయంగా ఆయన ఎదుటే వైఎస్సార్‌సీపీ తన గళాన్ని వైఎస్ జగన్ వినిపించారు. తద్వారా గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సమయంలో ప్రైవేటీకరణపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేయడం ప్రారంభమైంది.