ఏపీ స్ఫూర్తితో కర్షకులకు దీప్తి 

Central Govt Says bringing key changes in agriculture sector - Sakshi

వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తెస్తున్నట్టు కేంద్రం ప్రకటన 

సేంద్రియ వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్దపీట 

ప్రకృతి సాగువైపు కోటి మంది రైతులు 

సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయానికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కనీసం కోటి మంది రైతులను ప్రకృతి సాగు బాట పట్టించే లక్ష్యంతో కేంద్రం అడుగులేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటన చేశారు. వ్యవసాయ రంగం బలోపేతానికిæ ఏపీ బాటలోనే జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టబోతున్నట్టు పరోక్షంగా ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచింది.

రాష్ట్రంలో 7.54 లక్షల ఎకరాల్లో 7.05 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో కనీసం 15 లక్షల మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పలు రాష్ట్రాలతోపాటు లాటిన్‌ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాలు సైతం ఏపీ బాటలో అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. 

చిరు ధాన్యాల కోసం ‘శ్రీఅన్న’ 
వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మిల్లెట్‌ పాలసీని తీసుకురాగా.. ఇదే లక్ష్యంతో ‘శ్రీఅన్న’ పథకాన్ని ప్రకటించిన కేంద్రం చిరు ధాన్యాలపై పరిశోధనలు, ఉత్తమ యాజమాన్య పద్ధతులకు సహకారం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్‌ల)ను మల్టీపర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.2,718 కోట్లతో గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిర్మిస్తోంది.

ఇదే బాటలో కేంద్రం కూడా జాతీయ స్థాయిలో పీఏసీఎస్‌లను మల్టీపర్పస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు రూ.2,516 కోట్లు కేటాయించింది. ఏపీ బాటలోనే పీఏసీఎస్‌లను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో ప్రతి పంచాయతీలోనూ ఎంపీసీఎస్‌ల ఏర్పాటుతో పాటు ప్రైమరీ ఫిషరీస్, డెయిరీ కో–ఆపరేటివ్‌ సొసైటీలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ‘సహకార్‌ సే సమృద్ధి’ పథకాన్ని ప్రకటించింది.

పీఎం మత్స్య సమృద్ధి యోజన పథకం కింద దేశీయ మార్కెట్లకు చేయూతనివ్వాలని సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలో 26 ఆక్వాహబ్‌లు, 14 వేల ఫిష్‌ ఆంధ్రా అవుట్‌లెట్స్‌తో పాటు పెద్ద ఎత్తున ఫిష్‌ వెండర్స్, ఫిష్‌ కార్ట్స్‌ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్‌ను విస్తృత పర్చేందుకు పెద్దఎత్తున ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు.

ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. రాష్ట్రంలో ఏటా సగటున రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తుండగా.. కేంద్రం నిర్ణయంతో ఈ ఏడాది కనీసం రూ.2.50 లక్షల కోట్లను రుణాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి  

తగ్గనున్న మేత ధరలు 
మత్స్య ఉత్పత్తులు, ఎగుమతుల్లో ఏపీ నంబర్‌–1 స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆ ప్రభావం మేత ధరలపై పడి ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా కంపెనీలు మూడుసార్లు ïఫీడ్‌ ధరలు తగ్గించాయి. ఇటీవల తలెత్తిన ఆక్వా సంక్షోభ సమయంలో ముడి సరుకులపై విధించే దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు ప్రభుత్వపరంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఆక్వా ఫీడ్‌ తయారీలో ఉపయోగించే ఫిష్‌ మీల్, క్రిల్‌ మీల్, మినరల్‌ అండ్‌ విటమిన్‌ ప్రీమిక్స్‌లపై విధించే దిగుమతి సుంకం 15 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. అంతేకాకుండా ఫిష్‌ లిపిడ్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీంతో ఆక్వా ఫీడ్‌పై టన్నుకు కనీసం రూ.5 వేలకు పైగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top