
ఉద్యోగం ఇప్పిస్తామని టోకరా!
ఒకరు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బంధువు
మరొకరు స్థానిక ఆమ్‌ఆద్మీపార్టీ మాజీ ఇన్‌చార్జి
ఉద్యోగం ఇప్పిస్తే ఒక్కొక్కరితో రూ.3 లక్షలు ఒప్పందం
అడ్వాన్స్‌గా రూ.5లక్షలు వసూలు
ఆదోని అర్బన్: సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని ఐదుగురితో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున తీసుకుని, అడిగితే అంతు చూస్తానని బెదిరించిన ఇద్దరిపై 420 కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆదోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడారు.
సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బంధువు గుమ్మనూరు నారాయణ, ఆమ్‌ఆద్మీ పార్టీ మాజీ ఇన్‌చార్జి నూర్‌అహ్మద్ చెప్పి, ఆదోనికి చెందిన వెంకటేశ్, ప్రశాంత్, అనంతపురానికి చెందిన భాస్కర్, అశోక్, ఇమ్రాన్ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారు. వీరిని నమ్మించి ఉద్యోగాలు వస్తే ఒక్కొక్కరు రూ.3 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
అడ్వాన్సుగా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున రూ.5 లక్షలు వసూలు చేశారన్నారు. ఐదుగురిని నమ్మించేందుకు నూర్‌అహ్మద్, నారాయణ ఫోన్‌పేకు రూ.75 వేలు పంపాడని తెలిపారు. నారాయణకు డబ్బు ముట్టిందని, ఉద్యోగాలు కచ్చితంగా వస్తాయని ఆ ఐదుగురు నమ్మారు. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో ఇచ్చిన డబ్బు అయినా తిరిగివ్వాలని కోరగా కాలయాపన చేశారన్నారు. గట్టిగా అడగడంతో ‘మీ అంతు చూస్తాం’ అని బెదిరించారని తెలిపారు. దీంతో ఐదుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుమ్మనూరు నారాయణ, నూర్‌అహ్మద్‌లపై 420 కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ వెల్లడించారు.