వినియోగదారులకు అండగా కాల్‌సెంటర్‌

Call center for customers Andhra Pradesh - Sakshi

సమస్యల పరిష్కారానికి 1967 టోల్‌ఫ్రీ నంబరు 

పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల సాధికారతే ధ్యేయంగా.. వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్‌ పంపిణీలో జాప్యం, నాణ్యత లోపాలు, బరువులో వ్యత్యాసం, ఎండీయూల నిర్లక్ష్యం, డీలర్లపై ఫిర్యాదులు, కొత్త బియ్యం కార్డుల మంజూరు, సభ్యుల విభజన, చేర్పులు, మార్పులు, కొత్తకార్డు అప్లికేషన్‌ స్థితి, ఒకే దేశం – ఒకే రేషన్, గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేయకపోవడం, అదనపు రుసుము వసూలు, రశీదులు లేని వ్యవహారాలు, వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయించడం, పెట్రోల్, డీజిల్‌ నాణ్యత, పెట్రోబంకుల్లో కనీస సౌకర్యాల కొరత, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ప్రతి వ్యవహారంపైనా ఈ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను బియ్యం పంపిణీచేసే ఎండీయూ వాహనాలపైన కూడా ముద్రించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల వినియోగదారుల సేవాకేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తూ వినియోగదారులకు హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారాలపై సూచనలు చేస్తారని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top