రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్‌ ప్రాధాన్యం

BVR Mohan Reddy Comments On CM YS Jagan - Sakshi

‘వాణిజ్య ఉత్సవ్‌’లో పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

విప్లవాత్మక సంస్కరణల ఫలితాలు రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో అందుతాయి

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ తప్పనిసరి చేయాలి

విద్యతో పాటు ఉపాధి కల్పన చాలా కీలకమైన అంశం 

సాక్షి, అమరావతి: విద్యారంగంలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ‘సయంట్‌’వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం విజయవాడలో మొదలైన ‘వాణిజ్య ఉత్సవ్‌’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా రాజకీయ నాయకులు విద్యారంగాన్ని పట్టించుకోరని, సీఎం జగన్‌ దీనికి భిన్నంగా కీలక సంస్కరణలు చేపట్టారని ప్రశంసించారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా తొలిదశలో 15,000కిపైగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడం, అమ్మ ఒడి, విద్యా కానుక లాంటి కార్యక్రమాల అమలు, 26 స్కిల్‌ కాలేజీలు, 2 స్కిల్‌ వర్సిటీల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 

పరిశోధనలకు నిధులివ్వాలి..
ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ప్రతి ఎనిమిది ఉద్యోగాలకు ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్కిల్‌ కాలేజీలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వం విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని చెప్పారు. కేవలం చదువుపైనే కాకుండా ఉపాధి కల్పన దిశగా నవతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పరిశోధన రంగానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 

వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజ
రాష్ట్రంలో 19 భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులున్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం వల్ల పలు దేశాలకు వేగంగా ఎగుమతులు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి వ్యయాన్ని తగ్గించడంతో పాటు నష్ట భయాన్ని నివారించేలా సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. 600 మందికిపైగా పాల్గొంటున్న ఈ ఎక్స్‌పోర్ట్‌ కాన్‌క్లేవ్‌ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉందని, కోవిడ్‌ ఇబ్బందులున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top