సీఎం జగన్‌ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ప్రశంస

Britain Deputy High Commissioner Gareth Wynn Owen Praised Rythu Bharosa Centres - Sakshi

కియోస్క్‌ల ద్వారా ఇన్‌పుట్స్‌ బుకింగ్‌ వినూత్న ఆలోచన 

మూగ జీవాలకు అంబులెన్స్‌ సేవలు బాగున్నాయి

గ్రామ స్థాయిలోనే పంటల కొనుగోళ్లు ఎక్కడా చూడలేదు

అగ్రి ల్యాబ్‌ల సేవలు ఆదర్శప్రాయం 

సాక్షి, అమరావతి/కంచికచర్ల(నందిగామ): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి జగన్‌ దూరదృష్టికి నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) గారెత్‌ విన్‌ ఓవెన్‌ ప్రశంసించారు. తమ దేశంలోనూ ఇలాంటివి ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ‘ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. నిజంగా ప్రపంచ శ్రేణి ఇన్నోవేషన్‌ ఇది. ఇన్‌పుట్స్‌ బుకింగ్‌ కోసం కియోస్క్‌లు, నాలెడ్జ్‌ హబ్‌లు, పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.

ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన అంబులెన్స్‌లు, నాణ్యతకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ స్థాయిలో నెలకొల్పిన అగ్రి ల్యాబ్‌లు నిజంగా అద్భుతం’ అని బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల ఆర్బీకేతో పాటు నందిగామలోని వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్‌ను స్వయంగా సందర్శించి సేవలను పరిశీలించారు. 

రెండు గంటల పాటు ఆర్బీకేలోనే..
ఆర్బీకేలో రెండు గంటల పాటు గడిపిన బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు. పొలంబడిని పరిశీలించారు. గ్రామస్థాయిలో ఎంపిక చేసిన రైతుక్షేత్రాల్లో 14 వారాల పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతులపై శిక్షణనిస్తున్నామని, మూడు సీజన్‌లలో శిక్షణ ఇచ్చిన వారికి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తున్నామని, ఇలా మూడు విడతల్లో పొందిన వారికి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. ఆర్బీకేలో కియోస్క్‌ ద్వారా అందిస్తున్న సేవలు, ఇన్‌పుట్స్‌ బుకింగ్‌ విధానాన్ని బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. కియోస్క్‌ను స్వయంగా ఆపరేట్‌ చేసి వాతావరణ సమాచారాన్ని పరిశీలించారు. చాలా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆర్బీకేలో డిజిటల్‌ లైబ్రరీతో పాటు వ్యవసాయ మ్యాగజైన్స్‌ను పరిశీలించారు. స్మార్ట్‌టీవీ ద్వారా ప్రసారమవుతున్న ఆర్బీకే చానల్‌ కార్యక్రమాలను వీక్షించారు. ఈ – క్రాప్‌ బుకింగ్‌తో పాటు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్‌  సేవలు బాగున్నాయని అభినందించారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచిన పరికరాలను పరిశీలించి వినియోగంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మూగజీవాలపై శ్రద్ధ..
ఆర్బీకే ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్‌ సంచార పశుఆరోగ్య సేవారథాన్ని పరిశీలించి వినూత్నంగా ఉందని కితాబిచ్చారు. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ద్వారా పశువులను తరలించే విధానం, అంబులెన్స్‌లో మినీ లేబరేటరీ ద్వారా పరీక్షల తీరును పరిశీలించారు. మూగజీవాల కోసం ఇంత శ్రద్ధ తీసుకోవడం తానెక్కడా చూడలేదంటూ అభినందించారు. అనంతరం నందిగామలోని వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌ను సందర్శించారు. సుమారు గంటకు పైగా ల్యాబ్‌లోనే గడిపి ప్రతి ఒక్కటి స్వయంగా 
పరిశీలించారు.

ప్రభుత్వ దూరదృష్టి అద్భుతం
‘అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అధికారులు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు. వాటిని స్వయంగా పరిశీలించేందుకే ఇక్కడకు వచ్చా’ అని బ్రిటీష్‌ డిప్యుటీ హై కమిషనర్‌ తెలిపారు. సీఎం, అ«ధికారులు చెప్పిన దాని కంటే గొప్పగా రైతులకు సేవలు అందిస్తున్నారని చెప్పారు.  ‘ల్యాబ్‌ టు ల్యాండ్, ల్యాండ్‌ టు ల్యాబ్‌ విధానంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు అందిస్తున్నారు. నాణ్యతకు పెద్ద పీట వేశారు. ప్రతీ ఇన్‌పుట్‌ను పరీక్షించి మరీ రైతులకు అందిస్తున్నారు. సాగులో అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకే సేవలు అద్భుతంగా ఉన్నాయి’ అని తెలిపారు.

తొలిసారిగా అరిటాకులో భోజనం చేశానని, సంప్రదాయ పద్థతిలో వడ్డించే ఆహారం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా చేతి వేళ్లతో తిన్నానంటూ బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ట్వీట్‌ చేశారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఆర్బీకేల ఇన్‌చార్జి వల్లూరి శ్రీధర్, పొలంబడి ఇన్‌చార్జి బాలూనాయక్, ఎన్టీఆర్‌ జిల్లా వ్యవసాయాధికారి విజయభారతి, నందిగామ ఏడీ రమణమూర్తి, కంచికచర్ల మత్స్యశాఖ ఏడీ చక్రాణి, పశుసంవర్ధక శాఖ డీడీ వెంకటేశ్వరరావు, అగ్రిల్యాబ్‌ కోడింగ్‌ సెంటర్‌ డీడీ శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top