పుట్టెడు అవినీతి

Bribery Collections In Anantapur Municipal Corporation - Sakshi

ముడుపు చెల్లిస్తేనే బర్త్, డెత్‌ సర్టిఫికెట్లు  

నగరపాలక సంస్థలో వసూళ్ల పర్వం 

సర్టిఫికెట్‌కు రూ.4 వేల వరకు డిమాండ్‌ 

ఇబ్బందుల్లో సామాన్య జనం 

ప్రభాకర్‌: నమస్తే .. సార్‌ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. 
అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. 
ప్రభాకర్‌: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్‌.. 
అధికారి: అవునా.. ఏం అర్జెంట్‌ పని ఉందా.. 
ప్రభాకర్‌: అవును సార్‌..  చాలా పని ఉంది 
అధికారి: అయితే నీ ఫోన్‌ నంబర్‌ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. 
ప్రభాకర్‌: ఎంత ఖర్చు అవుతుంది సార్‌. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. 
అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్‌ ఇస్తా. 
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు     సెక్షన్‌లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. 

నగరంలో వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న ప్రభాకర్‌ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్‌ (పేరుమార్చాం)కి బర్త్‌ సరి్టఫికెట్‌ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ  ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్‌ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. 

అనంతపురం సెంట్రల్‌: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్‌ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. 

ఉద్యోగుల చేతివాటం 
నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. 

కఠిన చర్యలు తీసుకుంటాం 
నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  
– పీవీఎస్‌ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top