రాష్టాన్ని అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తోంది
శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ
పరిశ్రమలకు విశాఖలోనే భూములివ్వాలా.. అమరావతిలో ఇవ్వొచ్చుగా: మాజీ మంత్రి కన్నబాబు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మూడు పార్టీల పొత్తుతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టుపట్టిస్తోందని శాసనమండలిలో విపక్షనేత, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం నేడు పూర్తిగా దివాళా తీసిందన్నారు. విజయనగరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో విలువైన భూములను చంద్రబాబు రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆరోపించారు.
దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఉత్తరాంధ్ర భూములను వారికి 99 పైసలకే ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రక్తం పారిస్తోంది. పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఓటేశారన్న నెపంతో 200 కుటుంబాలను రెండేళ్లుగా గ్రామం నుంచి బహిష్కరించారు.
అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు వచ్చిన సాల్మన్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆయన అంత్యక్రియలకు వచ్చిన వారిని.. బంధువులను సైతం ఆధార్ కార్డులు చూపాలని పోలీసులు అడిగారు. ఇదేనా ప్రజాస్వామ్యం?. పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం’ అని టీడీపీ నేతలకు హితవు పలికారు.
అట్టర్ ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా ?
ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ విఫలమైన కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. పరిశ్రమలు రావాలంటే విశాఖలోనే భూములివ్వాలా? అమరావతిలో భూములు ఇవ్వవచ్చు కదా? ‘కేంద్రంలో భాగస్వామి అయిన చంద్రబాబు కేకే లైన్ వంటి కీలక భాగాన్ని ఒడిశాకు అప్పగించి.. ఆదాయం లేని ప్రాంతాలతో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం వలన ఎవరికి లాభం? ఇది పక్కా మోసం.
హైదరాబాద్‌లో చిన్న అపార్టుమెంట్లో ఏర్పాటైన ఉర్సా రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖలో భూములు కట్టబెట్టారు. ఆ సంస్థ ఏర్పాటై మూన్నాళ్లే అయింది. వాళ్లు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం ఏమిటి. విశాఖ భూములు కేటాయించడం ఏమిటి.. ఇదంతా పెద్ద కుంభకోణం’ అని కన్నబాబు ఆరోపించారు.


