Visakhapatnam: భవానిని చంపిందెవరు?

Bhavani Deceased Mystery Her Parents Doubt On Auto Driver Visakhapatnam - Sakshi

ఆటోడ్రైవరే అంతం చేశాడని కుటుంబసభ్యుల ఆరోపణ 

హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సింహాచలం(పెందుర్తి): అడవివరం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రహదారిలో భైరవవాక వద్ద సింహాచలం దేవస్థానం స్థలంలోని బావిలో ఆదివారం ఓ యువతి మృతదేహం బయటపడింది. రోజూ ఆమెను తీసుకెళ్లే ఆటోడ్రైవరే హత్య చేశాడని కుటంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్‌ ఏసీపీ శ్రీపాదరావు వెల్లడించారు. యువతి తల్లిదండ్రులు బంధువులు, శొంఠ్యాం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఆనందపురం మండలం శొంఠ్యాంనకు చెందిన సిమ్మ సత్యం, లక్ష్మి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

వీరికి కుమారుడు, కుమార్తె భవాని(22) ఉన్నారు. భవాని రెండేళ్ల నుంచి సింహాచలం కొండపై ఓ షాపులో పనిచేస్తోంది. శొంఠ్యాం సమీపంలోని కణమాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఎన్ని రాజు రోజూ భవానిని సింహాచలం తీసుకెళ్లి.. తిరిగి ఇంటికి తీసుకొస్తుంటాడు. అలానే ఈ నెల 3వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకు తన ఆటోలో భవానిని శొంఠ్యాం నుంచి తీసుకెళ్లాడు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు యువతి ఇంటికి వచ్చాడు. మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. నువ్వే కదా ఆటోలో తీసుకెళ్లావు అని వారు సమాధానం ఇవ్వగా.. మీ అమ్మాయి ఫొటో ఉందా అని రాజు వారిని అడిగాడు.

ఏంటి కొత్తగా ఫొటో అడుగుతున్నావు? అని గట్టిగా అడగ్గా.. అక్కడి నుంచి అతను వెళ్లిపోయాడు. వెంటనే వారు రాజుకు ఫోన్‌ చేయగా.. పొంతనలేని సమాధానాలిచ్చాడు. దీంతో వారు భవాని పనిచేసే షాపు యజమానికి ఫోన్‌ చేశారు. ఆమె రాలేదని యజమాని చెప్పడంతో అనుమానం వచ్చి మళ్లీ రాజుకు ఫోన్‌ చేయగా స్పందించలేదు.  4న ఉదయం 6 గంటల సమయంలో యువతి తల్లిదండ్రులకు రాజే స్వయంగా ఫోన్‌ చేసి.. భైరవవాకలోని బావి వద్ద భవాని చెప్పులు, పర్సు, మొబైల్‌ ఫోన్‌ ఉన్నాయని, తాను అక్కడే ఉన్నానని చెప్పాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు, బంధువులు భైరవవాకకు చేరుకుని.. బావి దగ్గర ఉన్న భవాని వస్తువులను చూశారు.

ఇవన్నీ భావి దగ్గర ఉన్నాయని నీకెలా తెలుసని.. మా అమ్మాయి ఎక్కడని రాజును ప్రశ్నించారు. నా స్నేహితుడు ఫోన్‌ చేసి చెప్పాడని పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భవాని తల్లిదండ్రులు ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు, భవాని బంధువులు బావి దగ్గర వెతకగా.. ఆమె ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం బావిలో భవాని మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న భవాని బంధువులు, గ్రామస్తులు భైరవవాక వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్‌ ఏసీపీ శ్రీపాదరావు, గోపాలపట్నం లా అండ్‌ ఆర్డర్‌ సీఐ మళ్ల అప్పారావు, పెందుర్తి సీఐ అశోక్‌ మృతదేహాన్ని పరిశీలించారు. డాక్‌ స్క్వాడ్, క్లూస్‌టీంలు వివరాలు సేకరించాయి. భవాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాలెన్నో..
భవాని మృతి మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో కచ్చితంగా ఇది హత్యేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు, భవాని ప్రేమించుకున్నారని, రాజు తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని సంఘటన స్థలంలో పలువురు మీడియాకు తెలిపారు. ఈ నెల 3న తన ఆటోలోనే భవానిని తీసుకెళ్లిన రాజు కొన్ని గంటల్లోపే తిరిగి ఆమె ఇంటికి వెళ్లడం, ఆమె ఫొటో అడగడం, ఆ తర్వాత పొంతన లేని సమాధానాలు, తర్వాత రోజు తానే స్వయంగా ఫోన్‌ చేసి బావి వద్ద భవాని వస్తువులు ఉన్నాయని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. 4న పోలీసుల సమక్షంలో బావిలో అణువణువూ గాలించినా భవాని ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం మాత్రం బావిలో మృతదేహం కనిపించింది. తన కూతురిని ఎక్కడో చంపేసి.. ఆదివారం ఉదయం బావిలో పడేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే భవానిని హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top