
ప్రభుత్వ కార్యాలయంలో కనీస సదుపాయాలు లేకపోవడమేంటి?
సమస్యను పరిష్కరించకుంటే సీఎస్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తాం
సమాచార కమిషన్‌లో సదుపాయాలపై ధర్మాసనం స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. మరుగుదొడ్డి కూడా లేకపోతే సమాచార కమిషన్ కార్యాలయానికి వచ్చే సామాన్యులు, ముఖ్యంగా మహిళల పరిస్థితి ఏమిటని నిలదీసింది. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం విస్మరించిందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది.
మరుగుదొడ్డి లేకుంటే సమాచార కమిషన్‌ను మరో చోటుకి తరలించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. లేకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.కాంత్రికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉప్పలూరి అభినవ్ కృష్ణ వాదనలు వినిపిస్తూ, సమాచార కమిషన్ సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదన్నారు.
ప్రభుత్వ్ర ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, భవన యజమానితో వివాదం కొనసాగుతోందన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ఆమె తెలిపారు.