సాగర తీరం మూగబోయింది | Beaches And Parks Silence With Lockdown in SPSR Nellore | Sakshi
Sakshi News home page

సాగర తీరం మూగబోయింది

Aug 10 2020 10:53 AM | Updated on Aug 10 2020 10:56 AM

Beaches And Parks Silence With Lockdown in SPSR Nellore - Sakshi

కావలి: తుమ్మలపెంట బీచ్‌లో నిర్మానుష్యం

ఆదివారాలు, ఇతర సెలవురోజుల్లో జిల్లాలోని బీచ్‌లు కళకళలాడేవి. ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది వచ్చి సముద్ర తీరాన సేద తీరేవారు. కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సడలించిన తర్వాత కొంతమేర మార్పు వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందరు వచ్చేవారు. అయితే తీర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో స్థానికులు పర్యాటకులను రానివ్వడంలేదు. దీంతో సాగర తీరం జనసంచారం లేక వెలవెలబోతోంది. దుకాణాలు మూతబడి అనేకమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్‌ నెల్లూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అనువుగా ఉంటుంది. తీరం వెంబడి జ్యోతిర్లింగాలయం, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాలు వెలిశాయి. పర్యాటక శాఖ నిర్మించిన రిసార్ట్స్‌ ఉన్నాయి. వసతులు బాగుండడంతో ఈ బీచ్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్దఎత్తున వచ్చేవారు. వేసవిలో అయితే ఆ సంఖ్య వేలల్లో ఉండేది. కరోనా కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులు పర్యాటకుల రాకను నిలిపివేశారు. ఐదునెలలుగా దుకాణాలు మూతపడ్డాయి. 

ఇప్పుడిలా.. 
తోటపల్లిగూడూరు: మండలంలోని కోడూరు బీచ్‌కు పర్యాటకుల రాక అధికంగా ఉండేది. ఇది నెల్లూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెలవు రోజుల్లో తీరానికి వేలాదిగా పర్యాటకులు వచ్చేవారు. అనేకమంది కుటుంబసభ్యులతో వచ్చి ఆటపాటలతో సంతోషంగా గడిపేవారు. యువత సందడి ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం బీచ్‌లో జనసంచారం లేదు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత అధికారులు బీచ్‌ సందర్శనపై ఆంక్షలు విధించారు. దీంతో పర్యాటకులు రావడం ఆగిపోయింది. బీచ్‌లో ఉన్న దుకాణాలు సైతం మూతపడ్డాయి. వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నారు.

ఎవరూ రాకుండా.. 
వాకాడు: ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే మండలంలోని తూపిలిపాళెం బీచ్‌ కరోనా వైరస్‌ కారణంగా వెలవెలబోతోంది. పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రదేశాలు మండలంలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి తూపిలిపాళెం బీచ్‌. రెండోది ఓడపాళెం లైట్‌హౌస్‌ బీచ్‌. ఇక్కడికి జిల్లా నుంచే కాకుండా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, తిరుపతితోపాటు కడప తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వేలసంఖ్యలో వచ్చేవారు. ఆదివారం వస్తే వన భోజనాలతో అనేకమంది సందడి చేసేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కళ తప్పింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత పర్యాటకులు తక్కువ సంఖ్యలో వచ్చారు. అయితే నెలరోజులుగా అలల ఉధృతి ఎక్కువగా ఉండడం, తీర ప్రాంత గ్రామాల్లో పలువురికి వైరస్‌ రావడంతో స్థానిక మత్స్యకారులు భయాందోళన చెంది దురాయి వేసి బీచ్‌ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడంలేదు. దీంతో ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. వేట లేకపోవడంతో మత్స్యకారులు తీరంలో లంగరు వేసిన తమ బోట్ల వద్ద కాపలా ఉంటున్నారు. కొందరు యువకులు ఎవరి కంట పడకుండా బీచ్‌కు వస్తున్నారు.

మూసివేశాం  
మైపాడు బీచ్‌లో పూజా సామగ్రి, కూల్‌డ్రింక్‌ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నా. కరోనా కారణంగా బీచ్‌కు పర్యాటకులు, భక్తులు రావడం లేదు. దీంతో దుకాణాలను మూసివేశాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీహరికోట రమణ, మైపాడు  

నిర్మానుష్యంగా.. 
విడవలూరు: కరోనా మహమ్మారి కారణంగా మండలంలోని రామతీర్థం బీచ్‌ కళ తప్పింది. దగ్గర్లో కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. బీచ్, ఆలయాన్ని చూసేందుకు ఆదివారాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చేవారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement