రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలు.. ఎవరా 10 మంది?

Banks lent above Rs 25 lakh crore to corporates - Sakshi

కొద్ది మంది కార్పొరేట్లకు రూ.25.43 లక్షల కోట్ల రుణాలిచ్చిన బ్యాంకులు

14 కోట్ల మంది రైతులకు రూ.20 లక్షల కోట్లు

పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

అయితే ఆ పది మంది వివరాలు మాత్రం రహస్యం

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సేద్యాన్ని నమ్ముకున్న కోట్ల మంది వ్యవసాయదారులకు బ్యాంకులు అందించిన రుణాలు దాదాపు రూ.20 లక్షల కోట్లు కాగా టాప్‌ టెన్‌ కార్పొరేట్లు / ప్రముఖ సంస్థలకు ఏకంగా రూ.25 లక్షల కోట్లకు పైగా రుణాలి­చ్చా­యి. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారాన్ని వెల్లడించినప్పటికీ, ఆ పది మంది కార్పొరేట్లు / సంస్థలు ఎవరనేది మాత్రం రహస్యంగానే ఉంచారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.  

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న టాప్‌ టెన్‌ కార్పొరేట్‌ రుణ గ్రహీతల వివరాలను తెలియచేయాలని లోక్‌సభలో ఎంపీ మనీష్‌ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ సమాధానం ఇచ్చారు. టాప్‌ టెన్‌ కార్పొరేట్లు గతేడాది సెప్టెంబర్‌ వరకు రూ.25,43,208 కోట్ల మేర రుణాలు పొందినట్లు తెలిపారు. ఆర్‌బీఐ చట్టం 1934 రుణ గ్రహీతల వారీగా క్రెడిట్‌ వివరాలు వెల్లడించటాన్ని నిషేధించినట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు గ్రూపులు, షెడ్యూల్‌ కమ­ర్షి­యల్‌ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకుల నుంచి పది మంది కార్పొరేట్లు  రుణాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.  

14 కోట్ల మంది రైతులు..
దేశంలో 14 కోట్ల మంది రైతులకు వచ్చే ఆర్థిక ఏడాది రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించినట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.18 లక్షల కోట్లుగా ఉంది.

ఒక పక్క దేశంలో వ్యవసాయం చేసే 14 కోట్ల మంది అన్నదాతలకు అందించే రుణాలు రూ.20 లక్షల కోట్లు కాగా కేవలం పది మంది కార్పొరేట్లకు ఏకంగా రూ.25.43 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయడం గమనార్హం. రైతులు సకాలంలో రుణాలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు లాంటి చర్యలకు దిగుతున్న బ్యాంకులు కార్పొరేట్‌ సంస్థలను మాత్రం ఉపేక్షిస్తున్నాయనే అభి­ప్రా­యం సాధారణ ప్రజల్లో పెరిగిపోతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top