రైతుభరోసా కేంద్రాల్లో ఇక బ్యాంకింగ్‌ సేవలు..

Banking Services Will Be Launched At Rythu Bharosa Centres - Sakshi

సాక్షి,కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతుభరోసా కేంద్రాలు మినీ బ్యాంకులుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ, అనుబంధశాఖలకు చెందిన అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ఇక నుంచి బ్యాంకింగ్‌ సేవలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల ముంగిటకు చేరనున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం 5000 జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల విలీనంతో కొత్త బ్యాంకులు ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. బ్యాంక్‌ బ్రాంచ్‌ స్థానంలో వివిధ బ్యాంకులు బిజినెస్‌ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రామాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్‌బీకేల్లోని ఈ సేవలు అందేలా ఏర్పాటు చేశారు. జిల్లాలో 877 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి.

వివిధ బ్యాంకులకు సంబంధించి 804 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు ఉన్నారు. వీరి ద్వారా ఆర్‌బీకేల్లోనే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి లీడ్‌ డి్రస్టిక్ట్‌ మేనేజర్‌ (ఎల్‌డీఎం) ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజినెస్‌ కరస్పాండెంట్లను ఆర్‌బీకేలతో మ్యాపింగ్‌ చేయడాన్ని పూర్తి చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఎల్‌డీఎం దగ్గరి నుంచి మార్గదర్శకాలుపంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో నగదు తీసుకోవాలన్నా.. నగదు జమ చేయాలన్నా.. నగదు బదిలీ చేయాలన్నా దూరప్రాంతంలోని బ్యాంకులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఇక నుంచి ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వస్తుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.     

రూ.20 వేల వరకు అవకాశం  
ఆర్‌బీకేల ద్వారా నగదు ఉపసంహరణ (విత్‌డ్రా), నగదు జమ (డిపాజిట్‌)తో పాటు నగదు బదిలీ కూడా చేసుకునే అవకాశం సోమవారం నుంచే అందుబాటులోకి రానుంది. బ్యాంకు ఖాతాల్లో నగదు ఉంటే ఆర్‌బీకేల నుంచి బిజినెస్‌ కరస్పాండెంటు ద్వారా రూ.20 వేల వరకు నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చు. రూ.20 వేల వరకు నగదు జమ చేయవచ్చు. నగదు ట్రాన్స్‌ఫర్‌ మాత్రం రూ.10 వేల వరకు చేసుకోవచ్చు. బిజినెస్‌ కరస్పాండెంట్ల  పని వేళలు త్వరలో నిర్ణయించనున్నారు. వారికి బ్యాంకులు ఇచ్చిన స్వైపింగ్‌ మిషన్‌లు, ట్యాబ్‌ల ద్వారా వారు ఆన్‌లైన్‌లోనే బ్యాంకింగ్‌ సేవలు అందించనున్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top