AP: ‘సంపూర్ణ గృహ హక్కు’పై విస్తృత ప్రచారం 

Awareness Program For Public Representatives On One Time Settlement In AP - Sakshi

డిసెంబర్‌ 21న పథకం ప్రారంభం

50 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం

గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ 

వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌పై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం

సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై ప్రజల్లో (లబ్ధిదారుల్లో)  విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అంతా చొరవ చూపాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ పథకానికి సంబంధించి ఏకకాల పరిష్కారం (వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌)పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డిసెంబర్‌ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈలోగా నియోజకవర్గాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులను కోరారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రాష్ట్రంలో 51,08,000 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 39.7 లక్షల మంది రుణగ్రహీతలు, 12.1 లక్షల మంది ఇతరులు (రుణాలు తీసుకోని వారు) ఉన్నారు.

డబ్బుల కోసం కాదు: మంత్రి బొత్స 
దివంగత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి బొత్స చెప్పారు. గతంలో ప్రభుత్వం డబ్బులిచ్చి ఇళ్లు నిర్మించిన వారికి వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ వర్తిస్తుందని తెలిపారు. డబ్బుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. పొదుపు సంఘాల మహిళలకు దీనిపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. మండల, మునిసిపల్‌ సమావేశాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు.

50 లక్షల మందికి ప్రయోజనం: సజ్జల 
రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున గృహ వసతి కల్పిస్తోందని, దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా కృషి చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు. 

రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ 100% మినహాయింపు: అజయ్‌జైన్‌ 
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు యూజర్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీ నుంచి వంద శాతం మినహాయింపు కల్పించినట్లు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ద్వారా బ్యాంకు రుణాలను కూడా పొందే వెసులుబాటు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌ బాషా, మంత్రులు సీదిరి అప్పలరాజు, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేశ్, కురసాల కన్నబాబు, సీహెచ్‌ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, గృహ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు దొరబాబు, ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే, పలువురు ఎమ్మెల్సీలు,
ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top